Cm Jagan: సారొస్తే.. అంతేగా..అంతేగా!

ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే చాలు.. జనానికి తిప్పలు తప్పడంలేదు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో ఆసరా సాయం పంపిణీ విడుదల నిమిత్తం ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

Updated : 25 Mar 2023 09:37 IST

ముఖ్యమంత్రి పర్యటనకు అధికారుల అత్యుత్సాహం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే చాలు.. జనానికి తిప్పలు తప్పడంలేదు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో ఆసరా సాయం పంపిణీ విడుదల నిమిత్తం ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ సభకు ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న పంచాయతీ వార్డు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులను తరలించే బాధ్యతను జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. వీరికోసం 110 వాహనాలు వినియోగించనున్నారు. వీటితో పాటు వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, తాగునీరు తదితర ఖర్చులన్నీ పంచాయతీ నిధుల నుంచే వినియోగించాలని ఓ జిల్లా స్థాయి అధికారి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో పొదుపు సంఘాల సభ్యులు సభకు రాకపోతే డ్వాక్రా రుణాలిచ్చే సమయంలో ఇబ్బంది పడతారని కొందరు యానిమేటర్లు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అవసరం లేకపోయినా సభాప్రాంగణానికి దూరంగా ఉన్న దాదాపు 40 తాటిచెట్లను నరికేశారు. గుండేరు డ్రెయిన్‌ నుంచి వచ్చే నీటితోపాటు సీతంపేట ఛానల్‌ పరిధిలోని ఆయకట్టు పొలాల నుంచి వచ్చే మురుగు నీరు కొల్లేరులోకి తీసుకువెళ్లే ప్రధాన మురుగు కాలువను అయిదు ప్రాంతాల్లో పూడ్చారు. వంతెనలు, దెందులూరులోని రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు హడావుడిగా శుక్రవారం వైకాపా జెండా రంగులు వేశారు. దెందులూరులో శనివారం దుకాణాలేవీ తెరవడానికి వీలులేదని అధికారులు శుక్రవారమే హుకుం జారీ చేశారు. శుక్రవారం నుంచే గ్రామంలో మూడు పాఠశాలలకు సెలవులిచ్చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని