అవునా.. పరిశీలిస్తాం.. చూస్తాం..!
ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్), పీఆర్సీ బకాయిలపై ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఎలాంటి నిర్ణయాలూ లేకుండానే ముగిసింది.
మొక్కుబడిగా మారిన ఉద్యోగుల సమస్యలపై చర్చలు
ఈహెచ్‌ఎస్, పీఆర్సీ బకాయిలపై లభించని స్పష్టత
ఉద్యమం కొనసాగుతుందన్న ఏపీ ఐకాస అమరావతి
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్), పీఆర్సీ బకాయిలపై ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఎలాంటి నిర్ణయాలూ లేకుండానే ముగిసింది. ఈహెచ్‌ఎస్‌కు ఉద్యోగులు చెల్లిస్తున్న వాటా, ప్రభుత్వ వాటాను కలిపి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పంపిస్తామనే హామీ తప్ప.. సమస్యలపై అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో అధికారుల నుంచి ఉద్యోగులకు ఎలాంటి హామీ లభించలేదు. పీఆర్సీ బకాయిలు, పేస్కేళ్లపై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పింది వినడం తప్ప అధికారులు ఏమీ చెప్పలేదు. ఛాయ్, బిస్కెట్ చర్చలుగానే ముగిశాయి. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు ఈనెల 31తో ముగియనున్నందున దీనిని మరో ఏడాది పొడిగించాలన్న ఉద్యోగుల సంఘాల వినతిపై ఆర్థిక శాఖ వద్ద దస్త్రం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ బిల్లులపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కార్యదర్శి సత్యనారాయణ వివరాలు తెలిపారు. ‘ఉద్యోగుల సమస్యలపై నాయకులను చర్చలకు పిలవడం.. వారు చెప్పింది వినడం.. అనంతరం పరిశీలిస్తామని చెప్పడం ఇటీవల కాలంలో ప్రభుత్వానికి సాధారణంగా మారిపోయింది. చర్చల సందర్భంగా నాయకులు చెప్పే సమస్యల్లో నుంచి ఒక్కోసారి ఒక్కో దాన్ని పరిష్కరించినా ఇప్పటికే దాదాపుగా అన్నింటికీ మోక్షం లభించేది. చర్చల పేరుతో హడావుడి చేయడం.. ఆ తర్వాత ఏం ఉపయోగం లేదని సంఘాల నాయకులు బయటకు వచ్చి ప్రకటించడం గత కొంతకాలంగా పరిపాటిగా మారింది. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎంత ఉన్నాయో ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయి. కానీ, వీటిని పట్టించుకోకుండా ప్రతిసారీ నాయకులను చర్చలకు పిలవడం.. వాటిని కొత్తగా వింటున్నట్లు చెప్పడం.. సమావేశం సుదీర్ఘంగా నిర్వహించడం..ఇదే జరుగుతోంది’ అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
దేనిపైనా స్పష్టత ఇవ్వలేదు
బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి
పీఆర్సీ బకాయిలు, ఆరోగ్య కార్డులపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఈ సమస్యలను కొత్తగా వింటున్నట్లు అధికారులు కనిపించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి(ఈహెచ్‌ఎస్) ఉద్యోగుల వాటాగా జమ చేస్తున్న డబ్బును ఆరోగ్యశ్రీ ట్రస్టుకు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తే మా బాధలు ఎవరికి చెప్పాలి. న్యాయమైన మా డిమాండ్ల పరిష్కారంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. బకాయిలు చెల్లించడంలోనూ, ఆర్థికేతర అంశాల పరిష్కారంలోనూ ఎందుకు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారో అర్థం కావడం లేదు. పీఆర్సీ బకాయిలపైనా స్పష్టత ఇవ్వలేదు. బకాయిలు ఎంత ఉన్నాయని అడిగితే ఇంకా లెక్కలు వేయలేదని చెప్పారు. ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ నిర్ణయించిన పేస్కేళ్లు ఇవ్వడం లేదు. పీఆర్సీ బకాయిలను పదవీవిరమణ తర్వాత చెల్లించేందుకు ఎప్పుడూ అంగీకరించలేదు. ఏపీ ఐకాస అమరావతి తరపున ఇచ్చిన డిమాండ్లపై ఇంతవరకు దృష్టి పెట్టలేదు. ఉద్యమం యథావిధిగా కొనసాగుతుంది. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరామర్శ కార్యక్రమం 27న నిర్వహిస్తాం. ఏప్రిల్ 5న మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం.
ఆర్జిత సెలవు బకాయిలు చెల్లించాలని కోరాం
బండి శ్రీనివాసరావు, ఛైర్మన్, ఏపీ ఐకాస
ఉద్యోగులందరికీ ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరాం. 50ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని చెప్పాం. సీపీఎస్‌లో పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరాం. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, టీఏ, ఆర్జిత సెలవుల పెండింగ్ బిల్లుల్లో రూ.1,984 కోట్లు చెల్లించినట్లు ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్జిత సెలవు బకాయిలు చెల్లించాలని కోరాం. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి గతంలో ఇచ్చిన డిమాండ్లపై ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
జీపీఎఫ్ నుంచి డ్రా చేసిన డబ్బు జమ కాలేదు
సూర్యనారాయణ, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ఉద్యోగులకు ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స అందించాలని కోరాం. వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టుల హేతుబద్ధీకరణ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. జీపీఎఫ్ ఖాతాల నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని మర్నాడే డిపాజిట్ చేశామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పినది తప్పని చెప్పాం. అక్టోబరు నుంచి ఏపీజీఎల్‌ఐ క్రెడిట్ కాలేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
ఈనెలాఖరుకు సీపీఎస్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తామన్నారు
వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య
సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మొత్తం రూ.1,554 కోట్లను ఈ నెలాఖరు లోపు చెల్లిస్తామని చెప్పారు. డీఏ మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరాం. దీర్ఘకాలిక వ్యాధులున్న ఉద్యోగులకు ఓపీ సేవలు, అవసరమైన మందులు అందించడం కోసం ప్రతి జిల్లాలో ఆసుపత్రిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్