పేదలు ఉండేది ఒకచోట.. ఇళ్ల స్థలం ఇచ్చింది మరోచోట

పేదలకు ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులపై శాసనసభలో అధికార వైకాపా ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు.

Published : 25 Mar 2023 04:56 IST

నియోజకవర్గం మారిపోయిన లబ్ధిదారులు
నివాసయోగ్యంగా లేవని  తిరస్కరించినచోట ఇప్పటికీ  ఇవ్వలేకపోయాం
శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేల ఆవేదన

ఈనాడు, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఎదురవుతున్న ఇబ్బందులపై శాసనసభలో అధికార వైకాపా ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. కొన్నిచోట్ల కోర్టు కేసుల కారణంగా పేదలకు స్థలాలు ఇవ్వలేదని, మరికొన్నిచోట్ల నివాసయోగ్యంగా లేవంటూ లబ్ధిదారులు తీసుకోలేదని వెల్లడించారు. ఒక నియోజకవర్గంలో ఉన్న వారికి మరో నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో.. జగనన్న కాలనీలకు మౌలికసదుపాయాలు, ఇళ్లపట్టాల పంపిణీపై సమస్యలను చెప్పేందుకు వైకాపా ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కోర్టు కేసుల కారణంగా కొన్నిచోట్ల స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే కళావతి విన్నవించారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల దరఖాస్తుల ఆమోదానికి 90రోజుల గడువు ఇచ్చారని, ఈ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని కోరారు. పెందుర్తి నియోజకవర్గంలో తన సొంతగ్రామమైన రాంపురంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ తెలిపారు. ఇంతకాలం కోర్టు కేసులు పరిష్కారమవుతాయని ఎదురుచూశామని, అవి పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. రాంపురం, లక్ష్మీపురం, పెనుగాడి గ్రామాల్లో 440మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు. వీరికి ప్రత్యామ్నాయ భూములను గుర్తించామని, వీటికి డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు.

సొంత నియోజకవర్గంలోనే కేటాయించాలి

సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేదమెట్టకు చెందిన 3వేల మంది లబ్ధిదారులకు ఒంగోలు సిటీ వారితో కలిపి పట్టాలు ఇవ్వడం వల్ల వారు పక్కనున్న నియోజకవర్గంలోకి వెళ్లిపోతున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తెలిపారు. తన నియోజకవర్గంలోనే వీరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఇళ్ల నిర్మాణాలకు సిమెంటు సమస్య ఉందని, భూమిని చదును చేసిన బిల్లులు రాలేదని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని చంద్రపూడిలో 550మందికి పట్టాలు ఇవ్వగా.. ఆ స్థలాలు పనికిరావని లబ్ధిదారులు తిరస్కరించారని..వాటిని రద్దు చేసినా ఇంతవరకు కొత్త పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ వెల్లడించారు. జి.కొండూరులోని వెంకటాపురంలో పట్టాలు ఇవ్వలేదని, ఇబ్రహీంపట్నం, గొల్లపూడిలోని జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ పథకం కింద వేసిన రోడ్లు పాడైపోయాయని తెలిపారు. లబ్ధిదారుల సౌకర్యం గుర్తించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చింతల రామచంద్రారెడ్డి సూచించారు. ఓటీఎస్‌ కింద డబ్బులు కట్టిన వారికి పట్టాలు రాలేదని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.


స్థలాలు ఇవ్వడం నిరంతర ప్రక్రియ: మంత్రి ధర్మాన

ళ్ల స్థలాలు ఇవ్వడమనేది నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25,427ఎకరాల పట్టాభూములను సేకరించామని చెప్పారు. కొన్నిచోట్ల ఇళ్ల స్థలాలు ఊరికి దూరంగా ఇచ్చేస్తున్నారని సభ్యులు అంటున్నారని, కాలనీ నిర్మాణం పూర్తయి, అన్ని సదుపాయాలు వస్తే ఇరుకుగా ఉండే గ్రామం కంటే అదే బాగుంటుందని వెల్లడించారు. పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు ఒకటి, రెండు సమస్యలు వస్తాయని, సభ్యులు వెళ్లినప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటారని తెలిపారు.  ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని