ఉదయం వ్యాయామమే మేలు

ఉదయం వేళల్లో వ్యాయామం వల్ల మన శరీరంలోని జన్యువుల్లో వంద రకాలకు పైగా మార్పులు జరుగుతాయి. అవి కొవ్వు కణాల్లోని ‘మైటోకాండ్రియా’ను ప్రేరేపించడంతో కణాల పనితీరు మెరుగుపడుతుంది.

Updated : 26 Mar 2023 11:47 IST

ఆ సమయంలో మెరుగ్గా జీవకణాల పనితీరు
నడుము చుట్టూ కొవ్వు తగ్గుదలకు దోహదం
ఈనాడు- హైదరాబాద్‌

ఉదయం వేళల్లో వ్యాయామం వల్ల మన శరీరంలోని జన్యువుల్లో వంద రకాలకు పైగా మార్పులు జరుగుతాయి. అవి కొవ్వు కణాల్లోని ‘మైటోకాండ్రియా’ను ప్రేరేపించడంతో కణాల పనితీరు మెరుగుపడుతుంది. హార్మోన్లు ఎక్కువగా విడుదలై, కొవ్వు బాగా కరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ వినియోగం కూడా సమర్థంగా జరుగుతుంది. అదే సాయంత్రం వేళల్లో జన్యువుల్లో మార్పులు అంత వేగంగా జరగడం లేదని పరిశోధనల్లో తేలింది. శరీరంలో శక్తి సమతౌల్యత  అనేది.. రోజులోని సమయంతో ముడిపడి ఉంటుందని పరిశోధకులు తేల్చారు. తెలతెలవారుతుండగా చేసే వ్యాయామాల వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని నిర్ధారించారు.

బరువు పెరిగిపోతున్నారా? పొట్ట ముందుకు సాగినట్లుగా ఉందా? నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా?... అయితే అధిక రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతల బారినపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే. వీటి బారినపడకుండా ఉండాలన్నా, నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించాలన్నా వ్యాయామం సమయానుసారంగా చేయడం చాలా ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోజూ వ్యాయామం చేస్తున్నా.. ఏ సమయంలో చేస్తున్నామనే దానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని వారు చెబుతున్నారు.

అసలు శరీరానికి శ్రమ ఇవ్వకుండా ఉండడం కంటే.. ఎప్పుడో ఒకప్పుడు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అయితే నడుము చుట్టూ కొవ్వును కరిగించేందుకు ఉదయం పూట చేసే వ్యాయామం బాగా మేలు చేస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా వైద్య సంస్థ, డెన్మార్క్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హెగెన్‌ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. కోపెన్‌హెగెన్‌ వర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ మెటబాలిక్‌ రిసెర్చీ (సీబీఎంఆర్‌) బృందం ఈ పరిశోధనకు నాయకత్వంవహించింది. ఈ పరిశోధన పత్రం ఇటీవలే అమెరికాకు చెందిన ‘ది ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌(పీఎన్‌ఏఎస్‌)’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఉదయకాల వ్యాయామాల వల్ల జీవక్రియల్లో జరిగే మార్పులు, కొవ్వు కరిగించడంలో కీలకపాత్రపై చెన్నై అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ పీజీ సుందరరామన్‌ ‘ఈనాడు’కు వివరించారు.

* సాధారణంగా మన శరీరంలో సమయానుగుణంగా మార్పులు జరుగుతుంటాయి. ఉదయం ఒక విధంగా, సాయంత్రం ఇంకోలా, రాత్రిపూట మరోలా మన శరీరం స్పందిస్తుంది. దీన్నే జీవ గడియారం అంటారు. దీనికి అనుగుణంగా అలవాట్లలో మార్పులుండాలని నిపుణులు సూచిస్తున్నారు.నిర్దిష్ట సమయంలో వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను కొనసాగించడం వల్ల జీవ గడియారం క్రమబద్ధమవుతుంది. వ్యాయామం లో కొవ్వును కరిగించడం ప్రధానమైన అంశం. ముఖ్యంగా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం ఆరోగ్యానికి చాలాముఖ్యం. పొట్టలో కిడ్నీలు, కాలేయం, క్లోమం తదితర ప్రధాన అవయవాలన్నీ ఉంటాయి. ఇక్కడ కొవ్వు పేరుకుపోతే.. ఆ అవయవాలపైనా దుష్ప్రభావం పడుతుంది.

* ఎక్కువమంది వ్యాయామానికి కూడా ప్రాధాన్యతనిస్తారు గానీ.. ఆహారపు అలవాట్లలో మాత్రం నిబంధనలు పాటించరు. వ్యాయామానికి,  ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను కూడా జోడిస్తేనే సానుకూల ఫలితాలు వేగంగా వస్తాయి. తీసుకునే ఆహారంలో ఏ మేరకు పిండి పదార్థాలున్నాయి? ఎంత మేరకు ప్రోటీన్లు? కొవ్వు పదార్థాలున్నాయనే అవగాహన చాలా అవసరం. పిండి పదార్థాలు 50% కంటే ఎక్కువగా ఉండే ఆహారం శరీరానికి మంచిది కాదు. పాలిష్‌ చేసిన బియ్యాన్ని, గోధుమలను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ త్వరగా విడుదలవుతుంది. ముడిబియ్యం, ముడి గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సమతులాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని