పొదుపు సంఘాల వృద్ధిలో దేశానికే ఆదర్శం

రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు ఏడాదికి రూ.30 వేల కోట్లు రుణాలుగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు.

Updated : 26 Mar 2023 04:42 IST

99.55 శాతం రుణాలు సకాలంలో తిరిగి చెల్లింపు
మూడో విడత ‘ఆసరా’ సాయం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు ఏడాదికి రూ.30 వేల కోట్లు రుణాలుగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాల్లో 99.55 శాతం సకాలంలో తిరిగి చెల్లించి దేశంలోని పొదుపు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి పొదుపు సంఘాల పురోగతిని చూస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత సాధించేందుకు కృషి చేస్తున్నామని, దేశంలో స్త్రీల సంక్షేమంపై దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైకాపాది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ మూడో విడత ఆర్థిక సాయం విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి, నిధులు విడుదల చేశారు. తొలుత దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు. ఆసరా లబ్ధిదారులతో ముచ్చటించి, వారితో ఫొటో దిగారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించిన అనంతరం సభలో మాట్లాడారు.

మహిళా సాధికారతకే ఆసరా

‘పొదుపు సంఘాలకు బాసటగా నిలుస్తామని నా పాదయాత్ర సమయంలోనే వాగ్దానం చేశా. రాష్ట్రంలోని దాదాపు 79 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12.8 వేల కోట్లు ఇచ్చాం. మూడో విడత సాయంగా ఈ రోజు నుంచి 10 రోజుల వ్యవధిలో మరో రూ.6,420 కోట్లు వివక్ష, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా వారి ఖాతాలో జమవుతాయి. ఈ నగదుతో ఇప్పటికే చాలా మంది మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. వీరికి మరింత చేయూతనిచ్చేందుకు 9.86 లక్షల మంది మహిళలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లు ఇచ్చేందుకు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేశాం. మహిళా సాధికారత కోసమే ఆసరా రూపంలో సాయం అందిస్తున్నాం.

వడ్డీ మరింత తగ్గించేందుకు కృషి 

గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలుగా ఏటా సగటున రూ.14 వేలు మాత్రమే ఇచ్చేవారు. మన ప్రభుత్వం ఏటా రూ.30 వేలు ఇస్తోంది. గత ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని మహిళలను మభ్యపెట్టి ఎన్నికల తర్వాత ఆ హామీని గాలికొదిలేసింది. సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పునరుద్ధరించి రూ.3,036 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాం. పొదుపు సంఘాలకు గతంలో రూ.3 లక్షల రుణానికి 13 శాతంగా ఉన్న వడ్డీని 7 శాతానికి, రూ.5 లక్షల రుణానికి 13 నుంచి 9.5 శాతానికి తగ్గించాం. మరింత తగ్గించేందుకు కృషి చేస్తాం. అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది తల్లులకు రూ.20 వేల కోట్లు, వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14.2 వేల కోట్లు, కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఈ పథకం ద్వారా రూ.2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల వరకూ లబ్ధి చేకూరనుంది. మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను 1.17 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. బటన్‌ నొక్కితే పోలీసులు వచ్చి చేయూతనిస్తారు. ఇప్పటి వరకూ 26 వేల మంది ఈ యాప్‌ ద్వారా సాయం పొందారు’ అని ముఖ్యమంత్రి వివరించారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. మహిళల పురోభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలే కారణమని కొనియాడారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఇద్దరు ఆసరా లబ్ధిదారులు మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు