బడ్జెట్ కేటాయింపులు లేకుండానే ఖర్చులు
ఏపీలో బడ్జెట్ తయారీ, నిర్వహణ తీరు తెన్నులను కాగ్ తప్పుబట్టింది. సరైన ముందస్తు అంచనాలు లేకపోవడం, కొన్నింటిలో నిధులు మిగిలిపోతే, మరికొన్నింటిలో నిధులు చాలకపోవడం, చివర్లో నిధులను సరెండర్ చేయడం, బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండా ఖర్చు చేయడం.. ఇలా అనేక లోపాలను బయటపెట్టింది.
పర్యవేక్షణ, నియంత్రణలో లోపాలు
164 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ వినియోగం
వివిధ పథకాలకు నిధులిచ్చినా వినియోగించుకోని వైనం
రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించిన కాగ్
ఈనాడు - అమరావతి
ఏపీలో బడ్జెట్ తయారీ, నిర్వహణ తీరు తెన్నులను కాగ్ తప్పుబట్టింది. సరైన ముందస్తు అంచనాలు లేకపోవడం, కొన్నింటిలో నిధులు మిగిలిపోతే, మరికొన్నింటిలో నిధులు చాలకపోవడం, చివర్లో నిధులను సరెండర్ చేయడం, బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండా ఖర్చు చేయడం.. ఇలా అనేక లోపాలను బయటపెట్టింది. పటిష్ఠ బడ్జెట్ నిర్వహణకు రాబడులు, ఖర్చుల ముందస్తు ప్రణాళిక, కచ్చితమైన అంచనాలు అవసరమని, అయితే కొన్నిచోట్ల కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు పెట్టారని, మరికొన్నిచోట్ల కేటాయింపులను ఖర్చుపెట్టక పోయేసరికి నిధులు మిగిలిపోయాయని తేల్చింది. ఇది ఖర్చుల పర్యవేక్షణ, నియంత్రణ లోపాలను సూచిస్తోందని పేర్కొంది.
కేటాయింపులు, ఖర్చులకు మధ్య వ్యత్యాసాలకు కారణాలను సంబంధిత నియంత్రణాధికారులు వివరించలేదని తెలిపింది. ఇది ప్రభుత్వంలోని జవాబుదారీతనానికి సంబంధించిన యంత్రాంగంపై ప్రభావాన్ని చూపుతుందని, ప్రజాధనం వినియోగంపై విధానపరమైన నియంత్రణను బలహీన పరుస్తుందని ఆక్షేపించింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది.
* రాష్ట్ర ప్రభుత్వం 2021-22లో ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.2,812.79 కోట్లు ఖర్చు చేసింది. అంతకు ముందు 2020-21లో ఇదేవిధంగా ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.741.66 కోట్లు(వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు సహా) వెచ్చించిన విషయంలో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఆమోదయోగ్యంగా లేదని కాగ్ పేర్కొంది. ఆడిట్ పరిశీలనను పరిగణనలోకి తీసుకుంటూ, భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కానివ్వబోమని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చినట్లు స్పష్టంచేసింది.
నగదు సామర్థ్యం... పేలవం
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(డబ్ల్యూఎంఏ) అనేది రాబడులు, వ్యయాల మధ్య తాత్కాలిక అసమతూకాన్ని ఆపే సదుపాయమని, రాబడుల్లో అంతరాన్ని తీర్చేందుకు రాష్ట్రానికి సహాయపడుతుందని కాగ్ పేర్కొంది. అయితే 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం 139 రోజులపాటు డబ్ల్యూఎంఏను ఆశ్రయించిందని, 164 రోజులపాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించిందని, ఇది పేలవమైన నగదు నిర్వహణ సామర్థ్యాన్ని.. రాబడులు, వ్యయాల అవాస్తవ అంచనాలను సూచిస్తోందని కాగ్ ఆక్షేపించింది. 2021-22లో రూ.2,34,657.40 కోట్ల వాస్తవ కేటాయింపులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,37,788.47 కోట్ల అనుబంధ కేటాయింపులు చేసింది. ఈ అనుబంధ కేటాయింపుల్లో రూ.1,06,205.59 కోట్లు(సప్లిమెంటరీ ప్రొవిజన్‌లో 77 శాతం) మొత్తం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ల చెల్లింపుల కోసం కేటాయించినట్లు పేర్కొంది.
అభివృద్ధి అంశాలకు తక్కువ...
వాస్తవికంగా లేని ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉండటం, పేలవమైన వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ, పథకాలు అమలు పరచడంలో బలహీనమైన నియంత్రణల వల్ల... అభివృద్ధి కారక అంశాలకు అవసరమైన దానికంటే తక్కువ కేటాయింపులు జరుగుతున్నట్లు కాగ్ పేర్కొంది. కొన్ని శాఖల్లో అధికంగా మిగుళ్లు ఏర్పడటంతో, నిధులు అవసరమున్న ఇతర శాఖలు వాటిని పొందలేకపోతున్నాయని ఆక్షేపించింది.
నోడల్ ఖాతాకు బదిలీ లేదు
కేంద్ర ప్రాయోజిత పథకమైన జాతీయ తృతీయ ఆరోగ్య సంరక్షణ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లిచ్చారు. వీటిలో ఏమీ ఖర్చుచేయలేదు. ఈ పథకానికి వచ్చిన రూ.250 కోట్లను సింగిల్ నోడల్ ఖాతాకు బదిలీ చేయలేదని కాగ్ ఆడిటింగ్‌లో గుర్తించింది.
* 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలో ఆరోగ్య రంగం మెరుగుకు(సెక్టార్ నిర్దిష్ట గ్రాంట్లు) సంబంధించి కేంద్రం నుంచి రూ.488.15 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి 2021, నవంబరులో వచ్చాయి. వీటిని 2022, ఫిబ్రవరిలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నిధుల బదిలీలో జాప్యం కారణంగా 2021-22లో ఉద్దేశించిన ప్రయోజనానికి నిధులు ఖర్చు చేయలేక పోయారు. రాష్ట్రప్రభుత్వం ఈ నిధులను సంవత్సరాంతంలో రాష్ట్ర సంచిత నిధికి లాప్స్ చేసినట్లు కాగ్ గుర్తించింది. ఇలా సెక్టార్ నిర్దిష్ట గ్రాంట్లను మురిగిపోయేలా చేయడం వల్ల ఆరోగ్య సేవలు అందించడంపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని, పథకాల లక్ష్యాలను సాధించలేక పోవచ్చని కాగ్ పేర్కొంది.
చివరిరోజు రూ.3,776.69 కోట్లు సరెండర్
బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో.. పూర్తికాకుండా, మిగుళ్లు ఉంటాయని ముందుగానే గమనించి, వాటి అవసరం లేదని తెలిస్తే... వెంటనే ఆర్థికశాఖకు సరెండర్ చేయాలి. కానీ రూ.3,776.69 కోట్లను ఆర్థిక సంవత్సరం చివరి రోజైన 2022, మార్చి 31న సరెండర్ చేశారు. ఇది బడ్జెట్ మాన్యువల్ ఉల్లంఘన అవుతుందని, బడ్జెట్ అంచనాలను తప్పుగా వేయడాన్ని సూచిస్తున్నట్లు తెలిపింది.
కేంద్ర నిధులనూ ఖర్చు చేయని వైనం
వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను తక్కువగా వినియోగించడం వల్ల ఆయా పథకాలపై ప్రభావం పడినట్లు పేర్కొంది.
* జాతీయ ఆరోగ్య మిషన్(ఆయుష్) వైద్యశాలలకు అవసరమైన అత్యవసర మందులు, వైద్య సేవ, విద్యను బలోపేతం చేసేందుకు రూ.73.62 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే, ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ యూనిట్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొంది.
* జాతీయ ఆరోగ్య మిషన్(ఏపీ వైద్య విధాన పరిషత్) కొవిడ్-18 కట్టడి, నియంత్రణ, నివారణకు కేంద్రం రూ.27.50 కోట్లు కేటాయిస్తే, ఈ నిధుల్ని వెచ్చించలేదు. ఇందుకు కారణాలేమిటో అధికారులు చెప్పలేదని కాగ్ తెలిపింది.
* ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద రూ.556.22 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.473.59 కోట్లు ఖర్చుకాగా, రూ.82.63 కోట్లు మిగిలిపోయాయి. దీనికి కారణాల్ని అధికారులు తెలపలేదని కాగ్ స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Palnadu: కుమారుడి తల తెగ్గోసిన కన్నతండ్రి.. ఆపై దాంతో ఊరంతా తిరిగిన ఉన్మాది
-
India News
UPSC: ఆ ఇద్దరూ నకిలీ ర్యాంకర్లే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటాం: యూపీఎస్సీ
-
India News
భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే
-
Ts-top-news News
Eamcet: ఈసారీ ‘స్లైడింగ్’ పెత్తనం కళాశాలలదేనా?
-
Crime News
Crime News: వృద్ధుణ్ని చంపి.. దేహాన్ని ముక్కలు చేసి.. యువజంట కిరాతకం
-
Ts-top-news News
Sangareddy: కట్నం చాల్లేదని పెళ్లి పీటలపై నుంచి పారిపోయిన ప్రేమికుడు