కుటుంబం నుంచే మహిళా సాధికారత ప్రారంభం కావాలి

‘మహిళల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నా.. వారికి భద్రత కల్పించలేకపోవడం దురదృష్టకరం.

Published : 26 Mar 2023 03:44 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట శేషసాయి

రాయదుర్గం పట్టణం, రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘మహిళల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నా.. వారికి భద్రత కల్పించలేకపోవడం దురదృష్టకరం. మహిళా సాధికారత మన కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. వారిపై దాడులు పూర్తిగా ఆగితేనే  అభివృద్ధి సాధ్యపడుతుంది’ అని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జస్టిస్‌ వెంకట శేషసాయి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శనివారం న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్‌ వెంకట శేషసాయితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రమేశ్‌, జస్టిస్‌ శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు. జస్టిస్‌ వెంకట శేషసాయి మాట్లాడుతూ.. మహిళలపై దాడులు పెరిగేందుకు ముఖ్య కారణం.. చట్టాలపై అవగాహన లేకపోవడం, చట్టాలన్నీ ఆంగ్లంలో ఉండటమేనని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమూ మరో కారణమని తెలిపారు. బాలికలను అమ్మేసే దుశ్చర్యలు నేటికీ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. జస్టిస్‌ శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ బాల్యవివాహాల అనర్థాలపై ప్రతి పాఠశాలలో అవగాహన కల్పించాలని సూచించారు. జస్టిస్‌ రమేష్‌ మాట్లాడుతూ బాలలు అత్యాచార కేసుల్లో నేరస్థులను శిక్షించే పోక్సో చట్టం వచ్చి పదేళ్లు గడుస్తున్నా నేటికీ ఆ నేరాలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. బాలలకు ఇంట్లోనే చెడు, మంచి స్పర్శలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జోగినుల ఇళ్ల నిర్మాణానికి రూ.1.17 కోట్ల చెక్కుతో పాటు 39 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను న్యాయమూర్తులు అందజేశారు. సాయంత్రం రాయదుర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో జస్టిస్‌ రమేశ్‌ పాల్గొన్నారు. ఆయన 1977-79 మధ్య ఈ పాఠశాలలో విద్యనభ్యసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని