మన్యంలో గిరిజనుల ఆందోళన

బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గిరిజన సంఘాలు నిరసన తెలిపాయి.

Published : 26 Mar 2023 03:44 IST

బోయ, వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చే  తీర్మానంపై నిరసన

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గిరిజన సంఘాలు నిరసన తెలిపాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని ఆక్రమించి ఇక్కడి వనరులను దోచుకోవాలని కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లా కేంద్రం పాడేరులో గిరిజన, గిరిజన ఉద్యోగుల సంఘాలు, ఆదివాసీ జేఏసీ జిల్లా కమిటీ ప్రతినిధులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్సయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ పరిసరాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ యాత్రను అడ్డుకొని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వద్ద రాస్తారోకో చేపట్టారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గిరిజన ఎమ్మెల్యేలు వ్యతిరేకించకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని వారు హెచ్చరించారు. భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శేషాద్రి అధ్యక్షతన కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన అరకు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి గంగులయ్య, భాజపా నాయకుడు పాంగి రాజారావు పాల్గొన్నారు.

గిరిజన సంఘాల అభిప్రాయం తీసుకోవాలి: సీపీఎం

ఈనాడు, అమరావతి: బోయ, వాల్మీకిల సమస్యపై నియమించిన కమిటీ నివేదిక రాక ముందే వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని శాసనసభ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం వంచన అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ‘ఏజెన్సీలోని గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించి ఈ సమస్యపై ఏకాభిప్రాయం సాధించాలి. మతంతో నిమిత్తం లేకుండా దళితులందర్నీ ఎస్సీల్లో చేర్చాలి. ఈ డిమాండ్‌ సాధనకు అఖిలపక్ష ప్రతినిధులను దిల్లీకి తీసుకువెళ్లాలి’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు