గిరిజనులకు నష్టం చేకూర్చే చర్యలొద్దు: కిశోర్‌చంద్రదేవ్‌

షెడ్యూల్డు తెగల్లో ఇతర కులాలను చేర్చాలని శాసనసభలో చేసిన తీర్మానం అమలైతే గిరిజనులకు తీరని నష్టమని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 26 Mar 2023 03:44 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: షెడ్యూల్డు తెగల్లో ఇతర కులాలను చేర్చాలని శాసనసభలో చేసిన తీర్మానం అమలైతే గిరిజనులకు తీరని నష్టమని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ అభిప్రాయపడ్డారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో తీర్మానాలతో షెడ్యూల్డు తెగల్లో మార్పులు చేర్పులు సాధ్యం కాదన్నారు. ఏదైనా తెగను లేదంటే జాతిని ఎస్టీల్లో చేర్చాలనుకుంటే రాజ్యాంగం ప్రకారం విధివిధానాలు ఉన్నాయన్నారు. ఐటీడీఏ పీవో నుంచి కలెక్టరుకు, ఆయన నుంచి గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శికి ఆయా జాతుల జీవన, ఆర్థిక స్థితిగతులు, సాంఘిక పరిస్థితులపై నివేదికలు పంపించాల్సి ఉందన్నారు. అనంతరం వీటిపై రాష్ట్ర మంత్రి మండలి చర్చించి మార్పులు చేర్పులపై తీర్మానం చేసి కేంద్రానికి సమర్పిస్తే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ గిరిజన హక్కుల కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చంద్రదేవ్‌ పేర్కొన్నారు. చంద్రశేఖర్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్డినెన్స్‌తో కొన్ని కులాలను ఎస్టీల్లో చేర్చారని, దాన్ని ఆసరాగా తీసుకొని కొందరు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలు పొందినట్లు గుర్తు చేశారు. తర్వాత న్యాయ సమీక్షలో ఆర్డినెన్స్‌ నిలవకపోయినప్పటికీ గిరిజనులు ఉద్యోగావకాశాలను కోల్పోయి నష్టపోయారని వివరించారు. ఇలాంటి నష్టదాయక చర్యలను విడనాడాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని