తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌

పేదల కష్టాలను గుర్తించి.. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అందించిన మహానాయకుడు ఎన్టీరామారావు అని భారాస ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పేర్కొన్నారు.

Updated : 27 Mar 2023 04:41 IST

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌

ఈనాడు, దిల్లీ: పేదల కష్టాలను గుర్తించి.. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అందించిన మహానాయకుడు ఎన్టీరామారావు అని భారాస ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడి ఏపీ-తెలంగాణభవన్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో అఖిల భారత తెలుగు అకాడమీ-బెంగళూరు, దిల్లీ ఆదిలీల ఫౌండేషన్‌వారు నిర్వహించిన శోభకృత్‌ నామసంవత్సర ఉగాది ఉత్సవాలు, ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్‌ అసాధారణ వ్యక్తిత్వమున్న నటుడు, నాయకుడు. పేదల కష్టాలను చూసి..వారికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన పార్టీని స్థాపించారు. విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చారు. కులమత భేదాలు లేకుండా తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్‌’’అని కొనియాడారు. అఖిల భారత తెలుగు అకాడమీ అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ మాట్లాడుతూ.. తమ సంస్థ తరఫున 10 నెలలుగా వివిధ నగరాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పుడు దిల్లీలో నిర్వహించినట్లు వెల్లడించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నృత్యపోటీలు, సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఎన్టీఆర్‌ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి దిల్లీ ఆదిలీల ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆదినారాయణ అధ్యక్షత వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని