విశ్వవిద్యాలయాలపై ఆ ఇద్దరి పెత్తనం

విశ్వవిద్యాలయాల పాలకవర్గ (ఈసీ) సమావేశాల్లో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పెత్తనం పెరిగేలా ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.

Published : 27 Mar 2023 04:39 IST

ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లేకుండా ఈసీ నిర్వహించకూడదంటూ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల పాలకవర్గ (ఈసీ) సమావేశాల్లో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పెత్తనం పెరిగేలా ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నామినీగా ఈసీలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. గతంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాలకవర్గంలో సభ్యుడిగా ఉండేవారు కాదు. వైకాపా అధికారంలోకొచ్చాక అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈసీ సభ్యుడిగా చేస్తూ చట్టంలో మార్పు చేశారు. ఇప్పుడు వీరిద్దరూ లేకుండా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రభుత్వ విధానాలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఏ అంశాల్లోనైనా వీరి అభిప్రాయాలను రికార్డు చేయకుండా తీర్మానాలు చేయకూడదని హెచ్చరించింది. విశ్వవిద్యాలయాల చట్టానికి విరుద్ధంగా ఈ ఆదేశాలు జారీచేసింది.  స్వయంప్రతిపత్తి కలిగిన వర్సిటీలపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి పెత్తనం పెరిగిపోయిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పాలకవర్గానికి అధికారాలు లేకుండా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయాల చట్టానికి ఇది పూర్తిగా ఉల్లంఘనే. ప్రభుత్వ నామినీగా ఉన్న ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ దృష్టికి తీసుకురాకుండా ఏ టేబుల్‌ ఐటమ్‌, ధ్రువీకరణ అంశం పెట్టకూడదని హెచ్చరించింది. ఈసీ సమావేశానికి 15రోజుల ముందు ఎజెండాను సభ్యులందరికీ పంపాలని, అన్ని అంశాలపై ప్రభుత్వ నామినీ నుంచి రాతపూర్వక హామీ తీసుకొని, దాన్ని ఈసీలో పెట్టాలని సూచించింది. ప్రభుత్వ విధానాలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, ముఖ్యకార్యదర్శి సలహా, అభిప్రాయం తీసుకోవాలని ఆదేశించింది. న్యాయస్థానాల్లోని కేసులు, పోస్టుల ఉన్నతీకరణ, ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటుతో అమలుచేసే పథకాలు, నిర్దిష్ట విషయాలపై ఎలాంటి తీర్మానం చేయకూడదని, పదోన్నతి, నియామకాలు, ప్రభుత్వంపై భారం పడేలా పోస్టులను సృష్టించడం, కొత్త కోర్సులను రెగ్యులర్‌, సెల్ఫ్‌పైనాన్స్‌గా ప్రారంభించడం తదితర అంశాల్లో ఈ ఇద్దరి రిమార్కులను రాతపూర్వకంగా రికార్డు చేయకుండా ఎలాంటి తీర్మానాలూ చేయకూడదని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని