ప్రొబేషన్‌ రాక వీఆర్వోల సతమతం

రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో గ్రేడ్‌-2 వీఆర్వోలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అర్హతలు సాధించి నెలలు గడుస్తున్నా ప్రొబేషనరీ పీరియడ్‌ ప్రకటించడంలో అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కోలా స్పందిస్తున్నారు.

Published : 27 Mar 2023 04:39 IST

ఒక్కో జిల్లాలో ఒక్కోలా నిర్ణయాలు
అర్హతలున్నా దక్కని ప్రయోజనం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో గ్రేడ్‌-2 వీఆర్వోలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అర్హతలు సాధించి నెలలు గడుస్తున్నా ప్రొబేషనరీ పీరియడ్‌ ప్రకటించడంలో అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కోలా స్పందిస్తున్నారు. ఒకేసారి విధుల్లో చేరిన వారికి ప్రొబేషనరీ పీరియడ్‌ ప్రకటించేందుకు ప్రభుత్వంనుంచి జిల్లా అధికారులకు నిర్దిష్ట  మార్గదర్శకాలు లేక ఈ అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది. దీంతో వేతనాల పెంపులోనే కాకుండా సీనియారిటీపరంగానూ వారు నష్టపోయే ప్రమాదమేర్పడింది. వీఆర్‌ఏలుగా పనిచేసే సుమారు 3,795 మందికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద గ్రేడ్‌-2 వీఆర్వోలుగా 2020 జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య జిల్లాలవారీగా పదోన్నతులనిచ్చారు. ఈ సందర్భంగా జారీ చేసిన జీవోలో రెండేళ్లకు ప్రొబేషనరీకి అవకాశముంటుందని పేర్కొన్నారు. ఏడాదిలోగా కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్టు (సీపీటీ), సర్వే అకాడమీ ద్వారా శిక్షణ పొంది నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలని నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ఏపీపీఎస్సీ ద్వారా సీపీటీ పరీక్ష ఏడాదిలోగా పూర్తయింది. సర్వే అకాడమీ ద్వారా స్వల్పకాలిక సర్వే ట్రైనింగ్‌ అర్హత పరీక్షలు మాత్రం రెండేళ్ల తరువాత అయ్యాయి. పరీక్షల్లో 55 శాతం అర్హత మార్కులు సాధించాలనే నిబంధన విధించారు. దీని ప్రకారం 52 శాతం వీఆర్వోలే ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫలితాలు వెలువడ్డాక, నెల్లూరు జిల్లాలో పరీక్ష నిర్వహించిన తేదీ నుంచి ప్రొబేషనరీ పీరియడ్‌ ప్రకటించారని సంఘం నేత ఒకరు తెలిపారు. ఈ జిల్లాల్లోని వారికి పేస్కేల్‌ ప్రకారం వేతనం రూ.26 వేలుగా ఖరారైంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకు ప్రొబేషనరీ పీరియడ్‌ ప్రకటించ లేదు. ఫలితంగా వారికి యథావిధిగా నెలకు రూ.15వేలే వేతనం వస్తోంది. మరోవైపు వీఆర్‌ఏల నుంచి గ్రేడ్‌-2 వీఆర్వోలుగా పదోన్నతి పొందిన వారిలో కొందరు 50ఏళ్ల పైబడిన వారూ ఉన్నారు. వారిలో చాలా మంది పరీక్షల్లో అర్హత సాధించలేకపోతున్నారు. నిబంధనల్లో వెసులుబాటునిచ్చి పేస్కేలు ప్రకటించాలని, అర్హతలను సాధించుకునేందుకు గడువునివ్వాలని వీఆర్వోలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని