Scrub Typhus : మచ్చలే కదా అని తీసిపారేయొద్దు.. తీవ్ర తలనొప్పీ ఓ సంకేతమే
చర్మంపై అకస్మాత్తుగా కాలిన మాదిరిగా మచ్చ కనిపించి తీవ్ర తలనొప్పితోపాటు చలి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే... ‘స్క్రబ్ టైఫస్’ బారినపడినట్లు భావించాలని వైద్యులు చెబుతున్నారు.
అది ‘స్క్రబ్ టైఫస్’ కావొచ్చు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
ఈనాడు, అమరావతి: చర్మంపై అకస్మాత్తుగా కాలిన మాదిరిగా మచ్చ కనిపించి తీవ్ర తలనొప్పితోపాటు చలి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే... ‘స్క్రబ్ టైఫస్’ బారినపడినట్లు భావించాలని వైద్యులు చెబుతున్నారు. చిన్న పురుగులు శరీరంపై కుట్టిన చోట్ల కాలిన మాదిరి మచ్చలు వస్తాయి. వీటితోపాటు తలనొప్పి, ఇతర లక్షణాలు కనీసం ఐదు నుంచి వారంరోజుల వరకు ఉంటాయి. సాధారణంగా జ్వరం ఎంతకీ తగ్గకపోతే... డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటుంటారు. ఈ పరిస్థితుల్లో శరీరంపై మచ్చలు కనిపిస్తే మాత్రం ‘స్క్రబ్ టైఫస్’ నిర్ధారణకు ‘ఎలిసా’ పరీక్ష చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ‘స్క్రబ్ టైఫస్‌ను ఆదిలోనే గుర్తిస్తే చికిత్స సులభమని.. కంగారు అవసరం లేదని చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ గురించి అవగాహన లేక... లోతైన విశ్లేషణలు జరగక... నమూనాల్ని పరీక్షించక... సమస్య తీవ్రతపై దేశవ్యాప్తంగా స్పష్టత ఉండటంలేదు. ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని... ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. కిట్లను ఇచ్చి, ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ‘భారత్‌లో తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతరచోట్లా ఈ కేసులు ఉంటున్నాయి. పరీక్షలు ఎక్కువగా జరిగేకొద్దీ... కేసులు పెరుగుతుంటాయి. కొందరికి పురుగు కుట్టినచోట పుండులా కనిపిస్తుంది. జాతీయస్థాయిలో గత పదేళ్లలో నమోదైన వాటిల్లో 18,781 కేసుల వివరాలు పరిశీలిస్తే 6% మరణాలు సంభవించాయి. ఐసీయూలో చికిత్స పొందినవారు 20%, వెంటిలేటర్ అవసరమైన వారు 17% ఉన్నారు. హైదరాబాద్ నగరంలోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి’’ అని నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం అధిపతి, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసులు అడపాదడపా వస్తూనే ఉన్నాయని విజయవాడకు చెందిన చిన్నపిల్లల వైద్యులు రామారావు వెల్లడించారు.
రాష్ట్రంలో...
గతేడాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అప్పాపురంలో 15 మంది స్క్రబ్ టైఫస్ బారినపడ్డారు. ఇతర జ్వరాల మాదిరిగానే అన్ని వయసుల వారు స్క్రబ్ టైఫస్ బారినపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి సరైన యాంటీబయాటిక్ మందులు ఉన్నాయని చెబుతున్నారు. కిందటేడాది రాష్ట్ర వ్యాప్తంగా అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి సేకరించిన సుమారు 2,500 నమూనాలను పరీక్షించారు. వీటి ద్వారా ఎక్కువ పాజిటివ్ కేసులు చిత్తూరు జిల్లాలో 208, తిరుపతి జిల్లాలో 139, అన్నమయ్య జిల్లాలో 158 చొప్పున బయటపడ్డాయి. తిరుపతి స్విమ్స్‌లో ఈ పరీక్షలు అధికంగా జరుగుతున్నందున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువ కేసులు వెలుగుచూశాయి.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాష్ట్రంలో 1,098 నమూనాలు పరీక్షిస్తే 209 పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రతి ఏటా ఈ కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి. పరీక్షల నిర్వహణకు తగ్గ సౌకర్యాలు ప్రభుత్వాసుపత్రుల్లో తక్కువగానే ఉన్నాయి. దీనివల్ల వెలుగులోకి వచ్చే కేసుల సంఖ్య తక్కువగా ఉంటోంది.
ఎలుకల ద్వారా...
‘బ్యాక్టీరియా లాంటి ఒక సూక్ష్మజీవి(ఓరియెంటియా త్సుత్సుగముషి)వల్ల స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుంది. ఈ సూక్ష్మజీవి బారినపడిన ఎలుకలను కుట్టిన పురుగులు మళ్లీ మనుషులకు కుట్టడం వల్ల సోకుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువ. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు మనుషులను కుడుతుంటాయి. కుట్టినచోట మచ్చలతోపాటు దదుర్లు ఉంటాయి. దీనిపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది’ అని ఎన్టీఆర్ కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్స్ సూక్ష్మజీవి విభాగ శాస్త్రం ప్రొఫెసర్ ఆనందకుమార్ తెలిపారు.
వైద్యులను సంప్రదించాలి
ఈ వ్యాధి బారినపడిన వారిలో అకస్మాత్తుగా జ్వరం రావడం, తీవ్ర తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు తిరగడం, మగతతో పాటు వాంతులు అవుతుంటాయి. మచ్చలు కనిపించినప్పుడు అప్రమత్తమై చికిత్స పొందాలి. ఇతర అనారోగ్యాలతో ఉన్న వారు ఈ వ్యాధి బారినపడితే న్యూమోనైటీస్, ఊపిరితిత్తుల సమస్యలు, ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్టెన్స్ సిండ్రోమ్‌కు గురవుతారని వైద్యులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!