వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలేవీ?.. కాగ్‌ ఆక్షేపణ

త్రైమాసిక పన్నులు, ఇతర ఫీజులు, జరిమానాల పూర్తి స్థాయి వసూళ్లలో రాష్ట్రంలో రవాణాశాఖ విఫలమైందని కాగ్‌ ఆక్షేపించింది.

Updated : 27 Mar 2023 05:17 IST

ఈనాడు, అమరావతి: త్రైమాసిక పన్నులు, ఇతర ఫీజులు, జరిమానాల పూర్తి స్థాయి వసూళ్లలో రాష్ట్రంలో రవాణాశాఖ విఫలమైందని కాగ్‌ ఆక్షేపించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివిధ పన్నుల వసూళ్లలో వెనకబాటుతనాన్ని ప్రస్తావించింది.

* 1.18 లక్షల వాహనాలకు వార్షిక సామర్థ్య పరీక్షలు చేయకపోవడంతో రూ.5.99 కోట్ల మేర ఫీజు వసూలు కాలేదని, ఇది రహదారి భద్రత విషయంలో రాజీ పడటమేనని పేర్కొంది.

* 75,621 రవాణా వాహనాలు, 406 రవాణాయేతర వాహనాలపై రూ.1.53 కోట్ల హరితపన్ను వసూలు చేయలేకపోయారని ప్రస్తావించింది.

* 5,151 రవాణా వాహనాల యజమానులనుంచి రూ.7.62 కోట్ల మేర త్రైమాసిక పన్ను జరిమానా వసూలు కాలేదని తెలిపింది.

* అపరాధ రుసుముల కాంపౌండింగ్‌ ఫీజు సవరించినాసరే.. పాత రేటుతో 3,176 వాహనాలకు ఫీజులు విధించడం వల్ల రూ.6.03 కోట్లు తక్కువగా వసూలైందని పేర్కొంది.

* 1,179 సెకండ్‌ హ్యాండ్‌ వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్‌లో జీవితపన్ను 14 శాతానికి బదులు 12 శాతమే విధించడం వల్ల రూ.1.25 కోట్లు కోల్పోయినట్లు తెలిపింది.

* ఏసీ బస్సుల ప్రయాణికులనుంచి జీఎస్టీ సకాలంలో వసూలు చేయడంలో ఏపీఎస్‌ఆర్టీసీ విఫలమైందని ప్రస్తావించింది. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ మార్పులో జాప్యంతో జీఎస్టీ తిరిగి చెల్లించేందుకు వడ్డీ, జరిమానా రూపంలో రూ.3.25 కోట్లు కోల్పోయినట్లు పేర్కొంది.

రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖలో..

* 57 దస్తావేజుల్లో లావాదేవీలు తప్పుగా వర్గీకరించడంతో రూ.2.10 కోట్ల మేర స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు తక్కువగా వసూలైంది.

* మార్కెట్‌ధర కంటే తక్కువ రేటుతో ఆస్తుల విలువ కట్టడం, నిర్మాణ ధరలను తప్పుగా తీసుకోవడం, చదరపు గజాలకు బదులు ఎకరం ధరను పరిగణనలోకి తీసుకోవడంవంటి 27 కేసుల్లో రూ.1.10 కోట్ల పన్నులు తక్కువగా వసూలైనట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని