అయిదో కాంటూరు.. తవ్వకాలు కనలేరు!

ప్రకృతి అందాలకు నెలవు.. వలస పక్షులకు ఆలవాలమైన మంచినీటి సరస్సు కొల్లేరు అక్రమార్కుల ధన దాహానికి రూపురేఖల్ని కోల్పోతోంది.

Published : 27 Mar 2023 04:52 IST

కొల్లేరులో అక్రమంగా ఆక్వా సాగు
నాయకుల అండతో మళ్లీ మొదలైన విధ్వంసం

ఏలూరు-ఈనాడు డిజిటల్‌: ప్రకృతి అందాలకు నెలవు.. వలస పక్షులకు ఆలవాలమైన మంచినీటి సరస్సు కొల్లేరు అక్రమార్కుల ధన దాహానికి రూపురేఖల్ని కోల్పోతోంది. సరస్సులో 5వ కాంటూరు పరిధిలో చెరువుల తవ్వకాలు, ఆక్వా సాగు, యంత్రాలతో పని చేయడం నిషిద్ధం. కానీ క్షేత్రస్థాయిలో వందల ఎకరాల్లో చెరువులు తవ్వేస్తున్నారు. వేల ఎకరాల్లో నిరంతరాయంగా ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కొందరు నాయకులే నడిపిస్తుండడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.

భారీ యంత్రాలతో తవ్వకాలు

ఏలూరు గ్రామీణ పరిధి పైడిచింతపాడులో దాదాపు 100 ఎకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వుతున్నారు. ఇది కొల్లేరులోని 5వ కాంటూరు పరిధిలో ఉంది. నీరు ఎండిపోవడంతో వారం నుంచి సుమారు 10 భారీ యంత్రాలు, 20 వరకు ట్రాక్టర్లతో రాత్రి పగలూ తేడా లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏలూరు మండలం చెట్టున్నపాడులోనూ గతంలో సాగు చేసి వదిలేసిన 300 ఎకరాలకు మళ్లీ గట్లు వేశారు. దీన్ని గుండుగొలనుకు చెందిన ఓ ఆసామి ఎకరానికి రూ.30 వేల చొప్పున కౌలుకు తీసుకున్నారు. కొక్కిరాయలంక పరిధిలో కూడా నెల కిందట 50 ఎకరాల్లో చెరువులకు మరమ్మతులు చేసి ప్రస్తుతం సాగు చేస్తున్నారు. ఏలూరు గ్రామీణ మండలంలోని మల్లవరం, ప్రత్తికోళ్లలంక, మాధవపురం, కోమటిలంక, పెదయాగనమిల్లి, కైకలూరు పరిధిలోని ఆటపాక, లక్ష్మీపురం, శృంగవరపుపాడు తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో చెరువులు తవ్వేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికోసం కొన్ని గ్రామాల పెద్దలు నాయకులు, అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. మండవల్లి దగ్గరలో మంచినీటి చెరువు తవ్వుతున్నాం అని పైకి ప్రచారం చేస్తూ.. 35 ఎకరాల్లో ఆక్వా చెరువులు తవ్వేందుకు అధికార పార్టీ నేతను గ్రామ పెద్దలు కలిసినట్లు తెలుస్తోంది.

కొత్తగా వేలాది ఎకరాల్లో..

కొల్లేరులో కొత్తగా వేలాది ఎకరాల్లో గుట్టుగా ఆక్వా సాగు మొదలైంది. ఏలూరు గ్రామీణ మండలం మానూరు, పెదయాగనమిల్లి, మొండికోడు, పైడిచింతపాడు, ప్రత్తికోళ్లలంక, మాధవాపురం, కోమటిలంకలో దాదాపు 1000 ఎకరాల్లో అక్రమంగా సాగు చేస్తున్నారు. కైకలూరు మండలం వడ్లకూటితిప్ప, శృంగవరపుపాడు, గుమ్మళ్లపాడు, లక్ష్మీపురం, నత్తగుల్లపాడు, చాటకాయ, పందిరిపల్లిగూడెం పరిధిలో మరో 1000 ఎకరాల్లో ఆక్వా సాగు కొనసాగుతోంది. మండవల్లి మండలం పెనుమాకలంక, పల్లంపర్రు, కొవ్వాడలంక, చింతపాడు గ్రామాల పరిధిలో దాదాపు 700 ఎకరాల్లో అక్రమ సాగు ఉంది. ఏడాదికి ఎకరానికి రూ.50-80 వేల వరకు కౌలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారన్నది అంతుబట్టని ప్రశ్నగానే మిగులుతోంది. ఈ విషయమై డీఎఫ్‌వో రవీంద్ర దామాను వివరణ కోరగా కొల్లేరులో చెరువుల తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

రెండు యంత్రాలు స్వాధీనం

‘ఏలూరు గ్రామీణ మండలం పైడిచింతపాడు పరిధి కొల్లేరులో తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం మేరకు పరిశీలించాం. పాత చెరువులకు గట్లు వేస్తున్నట్లు గుర్తించాం. తవ్వకాలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి రెండు యంత్రాలు స్వాధీనం చేసుకున్నాం’ అని వన్యప్రాణి సంరక్షణ శాఖ ఏలూరు రేంజ్‌ అధికారి కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని