సంక్షిప్త వార్తలు(11)

వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 5న జరిగే సీతారాముల కల్యాణానికి రావాలని ముఖ్యమంత్రి జగన్‌కు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Updated : 28 Mar 2023 05:09 IST

ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సీఎంకు ఆహ్వానం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 5న జరిగే సీతారాముల కల్యాణానికి రావాలని ముఖ్యమంత్రి జగన్‌కు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.


బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే.. తీర్మానంపై ఆదివాసీల ఆగ్రహం

ఎటపాక, న్యూస్‌టుడే: అధికార దాహంతోనే వైకాపా ప్రభుత్వం ఆదివాసులకు అన్యాయం చేస్తోందని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు(ఏఎస్‌పీ) రాష్ట్ర కార్యదర్శి బంగారు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఓట్ల కోసమే బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై శాసనసభలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లావ్యాప్తంగా గిరిజనులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఎటపాక మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మతో ర్యాలీ చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తీరు మారకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు.


కృష్ణపట్నం మూడో యూనిట్‌ కొత్త రికార్డు

సీవోడీ సమయంలో 816 మెగావాట్ల ఉత్పత్తి

ఈనాడు, అమరావతి: కృష్ణపట్నం థర్మల్‌ యూనిట్‌లో కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించింది. ప్లాంటును వాణిజ్య ఉత్పత్తిలోకి (సీవోడీ) తీసుకురావడం కోసం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధికారులు పరిశీలించారు. ఇందులో సగటున 816 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటు నుంచి వచ్చింది. ఇది థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి దేశంలోనే కొత్త రికార్డుగా జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 808 మెగావాట్ల అత్యధిక ఉత్పత్తి సాధించిన రికార్డు నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) పేరిట ఉంది. దీన్ని జెన్‌కో అధిగమించిందని అధికారులు తెలిపారు. కృష్ణపట్నం యూనిట్‌కు అవసరమైన బొగ్గును మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి కోల్‌ ఇండియా కేటాయించిందని, త్వరలో మూడో యూనిట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దేశీయంగా దొరికే బొగ్గుతోనే ఉత్పత్తి చేసే సాంకేతికతను మూడో యూనిట్‌లో వినియోగించారు.


విద్యాసంస్థల్లో 25% ఉచిత సీట్లకు పోర్టల్‌

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలన్న లక్ష్యంతో విద్యా హక్కు చట్టంలో సెక్షన్‌ 12(1)సీ కింద ప్రవేశాలను సులభతరం చేసేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి ఈ నెల 22 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అర్హులైనవారు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 14417, 95026 66864 నంబర్లలో సంప్రదించాలన్నారు.  


ఏప్రిల్‌ 26 నుంచి తెలుగు వర్సిటీలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ప్రస్తుత, పూర్వ విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వర్సిటీ వ్యవస్థాపకులు డా.నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) శతజయంతి ఉత్సవాలను ఏప్రిల్‌ 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతోపాటు గడిచిన 37 ఏళ్లలో ఆయా శాఖల్లో చదువుకున్న విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న ప్రస్తుత, పూర్వ విద్యార్థులు తమ పేర్లను ఏప్రిల్‌ 15లోగా ఆయా శాఖల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.


‘నియామకాల’పై సీజేకు సందేశాలు పంపొద్దు

అలాంటి వారిని అనర్హులుగా ప్రకటిస్తాం: హైకోర్టు రిజిస్ట్రార్‌

ఈనాడు, అమరావతి: గతేడాది అక్టోబరు 21న జారీచేసిన ఉద్యోగ ప్రకటనల ప్రకారం ఏపీలోని జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని రిజిస్ట్రార్‌(నియామకాలు) ఎస్‌.కమలాకరరెడ్డి తెలిపారు. కొత్త కోర్టుల ఏర్పాటు నేపథ్యంలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య పెరిగిందని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితాల వెల్లడి వ్యవహారమై కొంతమంది అభ్యర్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రకు నేరుగా సందేశాలు, ఈ-మెయిళ్లు పంపుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్య అభ్యంతరకరమని అన్నారు. సందేశాలు పంపిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని తెలిపారు.


అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు భూకేటాయింపు

స్వామి నారాయణ్‌ గురుకుల్‌ ట్రస్టు ప్రతినిధుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి జగన్‌ సమ్మతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు శ్రీస్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్టు ముందుకు వచ్చింది. ఈ మేరకు ట్రస్టు సభ్యులు సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. పాఠశాలల ఏర్పాటుకు భూమిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి సమ్మతించారు. ‘దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో స్వామినారాయణ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తమ ట్రస్టుకు వందెకరాలను కేటాయించేందుకు సన్నాహాలు జరిగాయి. వైఎస్‌ అకాల మరణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది’ అని ట్రస్టు ప్రతినిధులు సీఎంకు వివరించారు. సమావేశంలో ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి, విజయవాడ శాఖ కార్యనిర్వాహకుడు మంత్రస్వరూప్‌ స్వామి, ట్రస్టు సభ్యులు శ్రవణ్‌ప్రియ్‌స్వామి, విషుద్జీవన్‌ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.


రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

జాతీయ ధోబీ మహా సంఘ్‌ డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జాతీయ ధోబీ మహా సంఘ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సంఘ్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌లో సోమవారం మహా ధర్నా చేపట్టారు. సంఘ్‌ జాతీయ కన్వీనర్‌ అన్నవరపు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మహా ధర్నాకు తెదేపా లోక్‌సభ పక్ష నేత రామ్మోహన్‌నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సంఘీభావం తెలిపారు.


3,485 జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పూర్తి

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ దొరబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇప్పటి వరకు 3,485 జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, మరో 5,363 లేఅవుట్లలో పనులు పురోగతిలో ఉన్నాయని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ దొరబాబు వెల్లడించారు. 2.37 లక్షల మంది లబ్ధిదారుల ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు అమర్చినట్లు తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో 31వ బోర్డు సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.33 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుందని తెలిపారు. తాత్కాలిక మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,650 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. ఎండీ లక్ష్మీషా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 18.63 లక్షల గృహాలను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.


దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించాలనే తీర్మానంపై ఏఐసీఎఫ్‌ హర్షం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంపై ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ (ఏఐసీఎఫ్‌) నేతలు హర్షం వ్యక్తం చేశారు. సంఘ జాతీయ అధ్యక్షుడు విజయరాజు ఆధ్వర్యంలో సోమవారం పలువురు సంఘ నేతలు తాడేపల్లిలోని గురుకుల సంస్థ ప్రధాన కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జునను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంలో మంత్రి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 


భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధించాలి

క్రీడాకారులకు గవర్నర్‌ అభినందనలు

ఈనాడు, అమరావతి: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన స్వీటీ బూరా, లవ్లీనా బొర్గొహెయిన్‌, నిఖత్‌ జరీన్‌, నీతూ గాంగాస్‌లకు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్విస్‌ ఓపెన్‌-2023 పురుషుల డబుల్స్‌ విజేతలుగా నిలిచిన షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టిలను అభినందించారు. వీరంతా దేశానికి గర్వకారణంగా నిలిచారని, భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని