ప్రాజెక్టుల ఆలస్యంతో అదనపు భారం రూ.53,027 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో సాగుతున్న 56 ప్రాజెక్టుల నిర్మాణ ఆలస్యంతో రూ.53,027.91 కోట్ల అదనపు భారం పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 28 Mar 2023 03:37 IST

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో సాగుతున్న 56 ప్రాజెక్టుల నిర్మాణ ఆలస్యంతో రూ.53,027.91 కోట్ల అదనపు భారం పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇది మొత్తం ప్రాజెక్టుల వ్యయంలో 52.36 శాతానికి సమానమని వెల్లడించారు. అత్యధికంగా పోలవరం జలాశయ వ్యయం రూ.45,397.83 కోట్లు పెరిగినట్లు తెలిపారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విశాఖ రిఫైనరీ ఆధునికీకరణకు 2002, జులైలో రూ.20,928 కోట్లు అంచనా వేయగా 2023, అక్టోబరులో సవరించిన అంచనా ప్రకారం ఆ మొత్తం రూ.26,264 కోట్లకు పెరిగిందని (అదనంగా రూ.5,336 కోట్లు) మంత్రి వెల్లడించారు. 2021లో కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌ అంచనా వ్యయం రూ.1,045 కోట్లుగా అంచనా వేయగా, నిధుల కొరత, అటవీ భూముల సేకరణలో అసాధారణ జాప్యంతో ప్రాజెక్ట్‌ పనులు 216 నెలలు ప్రారంభంకాలేదని, తాజా అంచనా వ్యయం రూ.2,500 కోట్లకు చేరిందని వెల్లడించారు. మొత్తం 56 ప్రాజెక్ట్‌ల్లో 24 నిర్మాణంలో జాప్యంతో నిర్దేశిత గడువులో పూర్తి కాలేదన్నారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తికాకపోవడానికి శాంతిభద్రతల సమస్యలు, భూసేకరణలో జాప్యం, అటవీ అనుమతుల్లో ఆలస్యం, పునరావాసం, స్థానిక సంస్థల అనుమతుల జాప్యం, గుత్తేదారుల సమస్యలుంటాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని