మూడేళ్లలో 75% మార్కులు ఉంటేనే పరిశోధనకు అర్హత

రాష్ట్రంలో 2020-21 నుంచి ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీలో నాలుగో ఏడాది పరిశోధన, ఆనర్స్‌ యూజీ కోర్సులను ఉన్నత విద్యామండలి తీసుకురానుంది.

Published : 28 Mar 2023 03:37 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 2020-21 నుంచి ప్రవేశపెట్టిన నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీలో నాలుగో ఏడాది పరిశోధన, ఆనర్స్‌ యూజీ కోర్సులను ఉన్నత విద్యామండలి తీసుకురానుంది. విద్యార్థులు మూడేళ్ల తర్వాత కావాలనుకుంటే బయటకు వెళ్లిపోవచ్చని, ఒకవేళ నాలుగో ఏడాది చదవాలనుకుంటే ఆనర్స్‌ డిగ్రీ చేయొచ్చని ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావు తెలిపారు. మూడేళ్లలో కలిపి 75శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే పరిశోధనను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మిగతా వారు ఆనర్స్‌ యూజీ కోర్సులను చదువుకోవచ్చు. పరిశోధన కాకుండా ఇతర కోర్సుల్లో సింగిల్‌ లేదా డ్యూయల్‌ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. యూజీసీ సూచించిన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల డిగ్రీని తీసుకొచ్చారు. నాలుగో ఏడాది రెండు సెమిస్టర్లకు కలిపి పది పేపర్లు ఉంటాయి. వీటిల్లో సబ్జెక్టుకు అనుబంధంగా మూడు పేపర్లు చొప్పున నైపుణ్య శిక్షణ సబ్జెక్టులు ఉంటాయి. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి ఏడాది పీజీ చేసే అవకాశం కల్పిస్తారు. ఏడాది పీజీ కోర్సులను విశ్వవిద్యాలయాలు రూపొందించాల్సి ఉంది. నాలుగో ఏడాదిలో పరిశోధన పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీకి అర్హత సాధిస్తారు.

* జాతీయ విద్యా విధానం ప్రకారం వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో సింగిల్‌, డ్యూయల్‌ సబ్జెక్టు విధానం తీసుకురాబోతున్నారు. ఈ విధాన రూపకల్పన, సిలబస్‌ తయారీకి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఒక సబ్జెక్టు ప్రధానంగా చదువుతూ మరో మూడు మైనర్‌ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎంచుకున్న కోర్సులు, ఆసక్తి మేరకు మైనర్‌ సబ్జెక్టులు చదువుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని