Andhra News: భూ పరిహారం నొక్కేసిన వైకాపా నేత

కోన ఫారెస్టులోని తమ భూమిని తీసుకున్నందుకు కేఎస్‌ఈజడ్‌, ఏపీఐఐసీ అధికారులు చెల్లించిన పరిహారంలో కొంతమొత్తం వైకాపా నేత నొక్కేశారని బాధిత దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 28 Mar 2023 09:20 IST

కలెక్టర్‌కు బాధిత దళిత రైతు ఫిర్యాదు

కాకినాడ , న్యూస్‌టుడే: కోన ఫారెస్టులోని తమ భూమిని తీసుకున్నందుకు కేఎస్‌ఈజడ్‌, ఏపీఐఐసీ అధికారులు చెల్లించిన పరిహారంలో కొంతమొత్తం వైకాపా నేత నొక్కేశారని బాధిత దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది దళిత రైతులకు ఎకరానికి రూ. 10 లక్షల చొప్పన పరిహారం ఇవ్వగా, అందులో ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వంతున వైకాపా నాయకుడు, తొండంగి మండలం కోదాడ సర్పంచి భర్త బూర్తి నాని అక్రమంగా తీసుకున్నారని ఆరోపించారు. ఆ సొమ్మును తిరిగి ఇప్పించాలని అదే పంచాయతీకి చెందిన నొక్కు సూర్యనారాయణ సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌ కృతికాశుక్లాకు ఫిర్యాదు చేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం ద్వారా ఒక్కో దళిత రైతుకు కలెక్టర్‌ చొరవతో రూ. 10 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారని, దీనికోసం పెద్దాపురంలో బ్యాంకులో ఖాతా తెరిపించారన్నారు. రైతు బ్యాంకు ఖాతా, చెక్‌బుక్కు వైకాపా నేత నాని తీసుకున్నారన్నారు. పరిహారం బ్యాంకు ఖాతాలో జమ చేయాలంటే ఖాళీ చెక్కుపై సంతకం చేయాలని ఆయన ఒత్తిడి చేశారన్నారు. అలా సంతకాలు చేయించుకుని ఒక్కొక్క ఖాతా నుంచి రూ.3 లక్షలు చొప్పున తీసేసుకున్నారని కలెక్టర్‌కు వివరించారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం, బ్యాంకు అధికారులు ఆ నాయకుడితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కలెక్టర్‌ స్పందించి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు పరిహారం సొమ్ము దక్కే వరకు మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతులకు తిరిగి సొమ్ము ఇప్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని