సుసంపన్నంగా ఎదిగేందుకు సహకరిస్తాం

ఆంధ్రప్రదేశ్‌ ఒక సుసంపన్న రాష్ట్రంగా మారేందుకు తమ సహకారం, మద్దతు ఉంటాయని ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చింది.

Published : 28 Mar 2023 04:23 IST

ఏపీకి ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భరోసా

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఒక సుసంపన్న రాష్ట్రంగా మారేందుకు తమ సహకారం, మద్దతు ఉంటాయని ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చింది. ఆ బ్యాంకు భారత విభాగ సంచాలకుడు డైరెక్టర్‌ అగస్ట్‌ తనో కవుమే నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎంతో తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయింది. సోమవారం జరిగిన ఈ సమావేశ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. వాటి ప్రకారం.. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న ఏపీ ప్రజారోగ్య రంగం, సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (సాల్ట్‌), ఏపీ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్ట్‌(ఏపీఐఐఏటీపీ)లపై చర్చించారు. సమావేశంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి అగస్ట్‌ మాట్లాడుతూ ‘వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా చూశాం. ఒక ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సేవలను అందించగలదనేందుకు ఉదాహరణగా నిలిచిన మీకు అభినందనలు. 2047 నాటికి ఏపీ సుసంపన్నం అయ్యేందుకు మీ దార్శనికతకు, విధానాలకు మా సహకారం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ‘విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరుతున్నాను. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నాం. సత్య నాదెళ్ల వంటివారు మరింత మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాలన్నది మా ఉద్దేశం. రాష్ట్రంలో ఆరు నౌకాశ్రయాలున్నాయి. మరో నాలుగు రానున్నాయి. పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. వైద్యారోగ్యశాఖలో కొత్తగా సుమారు 40 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. 17 కొత్త వైద్య కళాశాలలను నిర్మిస్తున్నాం, ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థంగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామి కావాలని, కేవలం ఆర్థికంగానే కాకుండా సాంకేతికంగానూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సుదీప్‌ మజుందార్‌, కార్తీక్‌ పెంటల్‌, ఆండ్రూ డి.గుడ్‌ల్యాండ్‌, హూన్‌ సాహిబ్‌ సోహ్‌, జుంకో ఒనిషి, ట్రీనా ఎస్‌.హక్‌, భావనా భాటియా, పలువురు రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని