ఆర్థికసంఘం నిధుల సర్దుబాటు ఏకపక్షం
గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన ఆర్థికసంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద సంబంధిత పంపిణీ సంస్థలకు సర్దుబాటు చేయడాన్ని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది రాజ్యాంగ ఉద్దేశానికి విరుద్ధం
విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.1,351.47 కోట్ల మినహాయింపుపై కాగ్ ఆక్షేపణ
ఈనాడు, అమరావతి: గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన ఆర్థికసంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద సంబంధిత పంపిణీ సంస్థలకు సర్దుబాటు చేయడాన్ని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) తీవ్రంగా తప్పుపట్టింది. పంచాయతీల అనుమతి లేకుండా నిధులు మినహాయించడం స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న రాజ్యాంగ ఉద్దేశానికి విరుద్ధమని కాగ్ ఆక్షేపించింది. 2021-22 సంవత్సరానికి స్థానిక సంస్థలు విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.1,351.47 కోట్ల విద్యుత్తు బకాయిలను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మినహాయించడాన్ని 2022 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికలో కాగ్ ప్రధానంగా ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పంచాయతీలు నిధులు కోల్పోయాయని పేర్కొంది.
నేరుగా బదిలీ చేయాలి...
విద్యుత్తు పంపిణీ సంస్థల బకాయిలు చెల్లించాలని లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ పథకంలో షరతు ఉన్నప్పటికీ... ఆర్థిక సంఘం నిధుల నుంచి మినహాయించాలని నిర్దిష్టమైన షరతు, నిబంధనలేదని కాగ్ కుండబద్దలు కొట్టింది. 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన షరతులు తప్పితే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరే ఇతర షరతులూ విధించరాదని నిబంధనలు చెబుతున్నాయిని కాగ్ స్పష్టంచేసింది. ఆర్థిక సంఘం నిధులను ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా పంచాయతీలకు బదిలీ చేయాలని, అలా చేయకపోతే... మార్కెట్ రుణాలపై విధించే వడ్డీకి సమానమైన జరిమానా చెల్లించాలని ఆదేశాలున్నట్లు పేర్కొంది. ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్థికసంఘం నిధుల నుంచి విద్యుత్తు బకాయిలకు మినహాయించిందని కాగ్ ఆక్షేపించింది.
అకౌంటింగ్ విధానాలకు విరుద్ధం
స్థానిక సంస్థలకు చెందిన నిధుల సర్దుబాటు లావాదేవీలు అకౌంటింగ్ విధానాలకు విరుద్ధమని కాగ్ ఆక్షేపించింది. పుర, నగరపాలక, పంచాయతీల వ్యక్తిగత డిపాజిట్ల ఖాతాల నుంచి 2021-22లో ఇతర ప్రభుత్వ సంస్థలకు సర్దుబాటు చేసిన లావాదేవీలు ఏపీ ఆర్థిక కోడ్‌లో సూచించిన విధానానికి విరుద్ధమని స్పష్టంచేసింది. సంబంధిత ఖజానా అధికారి నుంచి అవసరమైన అనుమతులు తీసుకోకుండా... 2022 ఫిబ్రవరి వరకు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్)లో సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్ (సీపీసీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటుకు అనుమతించింది. వీటిలో ఆర్థిక సంఘం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా), ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులున్నట్లు కాగ్ గుర్తించింది.
ఆర్థికసంఘం ఏర్పాటులో జాప్యంపై అభ్యంతరం
రాష్ట్ర ఆర్థికసంఘం ఏర్పాటులో జాప్యంపైనా కాగ్ అభ్యంతరం తెలిపింది. నాలుగో ఆర్థికసంఘం ఏర్పాటుకు సంబంధించి 2021 సెప్టెంబరు వరకు గవర్నర్‌కు నివేదించలేదని వెల్లడించింది. ఇది వరకు ఏర్పాటైన రాష్ట్ర ఆర్థిక సంఘాలు చేసిన సిఫారసులు, నివేదికలు సమర్పించిన తేదీల వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేవని పేర్కొంది.
ఖర్చు చేయని నిధులు రూ.3,550.60 కోట్లు
స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్నీ రాష్ట్రం సరిగా ఖర్చు చేయని విషయాన్ని కాగ్ గుర్తించింది. 2021 మార్చి 31న స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల నిల్వలను తన నివేదికలో ప్రస్తావించింది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల్లో రూ.1,929.70 కోట్లు, పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో రూ.1,626.90 కోట్లు ఖర్చు చేయకుండా ఉన్నట్లు పేర్కొంది. మొత్తం రూ.3,550.60 కోట్లు వ్యయం కాలేదని కాగ్ వివరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
-
World News
Flight Passengers: బ్యాగేజ్తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్లైన్స్ సంస్థ!