పోలవరం ముంపుపై సీఎంల స్థాయి సమావేశం జరగలేదు

పోలవరం ముంపును సవాలు చేస్తూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన కేసులో సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరిష్కారం కనుగొనడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున కేసు విచారణను 3 నెలలపాటు వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

Updated : 28 Mar 2023 06:35 IST

అందుకు కేసు విచారణను 3 నెలలు వాయిదా వేయాలి
సుప్రీంకు కేంద్రం లేఖ

ఈనాడు, దిల్లీ: పోలవరం ముంపును సవాలు చేస్తూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన కేసులో సెప్టెంబరు 6న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరిష్కారం కనుగొనడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున కేసు విచారణను 3 నెలలపాటు వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు ఈ ప్రాజెక్టుపై వ్యక్తం చేసిన సమస్యలపై కేంద్ర జల్‌శక్తి శాఖ, పర్యావరణ శాఖలు భాగస్వాములందరితో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించిందని వివరించింది. అవసరమైతే భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై మిగిలిన సమస్యలను పరిష్కరించాలని నాడు కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు కొంత సమయం పట్టే అవకాశమున్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ లేఖలో పేర్కొంది. జల్‌శక్తి మంత్రి, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశం ఏర్పాటు అంశం ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్నట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. అందువల్ల విచారణను మరో 3నెలలు వాయిదా వేయాలని కోరింది. వాస్తవానికి ఈ కేసు డిసెంబరు 7న విచారణకు వచ్చినప్పుడు కూడా జల్‌శక్తి శాఖ ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చి విచారణను 2 నెలలు వాయిదా వేయాలని కోరింది. కేసులో నాలుగు రాష్ట్రాల అభిప్రాయాలు వచ్చాయని, దానిపై 2 నెలల్లోపు కోర్టుకు నివేదిక సమర్పిస్తామని పేర్కొంది. ఆ మధ్యలో సమస్యపై ఏకాభిప్రాయ సాధన కోసం ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పింది. ఆనాటి విజ్ఞప్తినిబట్టి విచారణను ఫిబ్రవరి 15కు కోర్టు వాయిదా వేసింది. అయితే అప్పుడు కూడా కేసును 4వారాలపాటు వాయిదా వేయాలని కోరుతూ కేంద్రం లేఖ రాయడంతో తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ 3 నెలల గడువును కేంద్రం కోరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని