తిరుమలకూ గంజాయి

తిరుమలకు గంజాయి తరలిస్తూ తితిదే పొరుగు సేవల ఉద్యోగి ఒకరు రెండు రోజుల కిందట పట్టుబడ్డాడు.

Updated : 28 Mar 2023 06:36 IST

నెలలో వెలుగుచూసిన రెండు సంఘటనలు
దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు
లోపాలు సరిదిద్దకుంటే మరింత ప్రమాదం

ఈనాడు-అమరావతి, తిరుపతి, న్యూస్‌టుడే-తిరుమల: తిరుమలకు గంజాయి తరలిస్తూ తితిదే పొరుగు సేవల ఉద్యోగి ఒకరు రెండు రోజుల కిందట పట్టుబడ్డాడు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి వాటిని కాలికి కట్టుకుని తిరుమలకు తీసుకెళుతూ చిక్కాడు.

* కూరగాయల రవాణా వాహనంలో తిరుమల కొండపైకి గంజాయి తరలిస్తూ గత నెల చివరి వారంలో ఇద్దరు పట్టుబడ్డారు. తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేటు వద్ద తనిఖీల్లో వారు చిక్కారు. 

ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మద్యం, మాంసం, సిగరెట్లు వంటివి పూర్తిగా నిషేధం. అలాంటిచోటకు ఇప్పుడు ఏకంగా గంజాయి సరఫరా అవుతోంది. నెలలో వెలుగుచూసిన ఈ రెండు సంఘటనలు సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. నిరంతర తనిఖీలు ఉండే తిరుమలకే గంజాయి సరఫరా అవుతోందంటే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో దాని వ్యాప్తి, వినియోగం ఎంత విస్తృతంగా ఉందో అంచనా వేయవచ్చు. తితిదేకు ప్రత్యేక విజిలెన్స్‌ విభాగం, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉన్నాయి. అయితే తనిఖీల్లో లోపాలు, నిఘా వైఫల్యం వల్ల గంజాయి తిరుమలకు చేరుతోంది. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. నిషేధిత పదార్థాలు రవాణా కాకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాల్సి ఉంది.

మూలాల్లోకి వెళితేనే..

* తిరుమలలోని హోటళ్లలో పనిచేసేందుకు, ఇతర కూలీ పనుల కోసం వివిధ ప్రాంతాలనుంచి చాలా మంది రోజూ కొండపైకి రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో కొందరికి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉండటంతో మాఫియా వారిని లక్ష్యంగా చేసుకుంటోంది. తిరుమలకు గుట్టుగా గంజాయి తరలిస్తూ చిన్నచిన్న పొట్లాల్లో విక్రయిస్తోంది. తాజా నేరాన్ని గమనిస్తే.. చిన్నచిన్న ప్లాస్టిక్‌ కవర్లలో నింపి వాటిని కాలికి చుట్టుకోవడాన్నిబట్టి నిందితుడు తొలిసారి చేసినట్లు అనిపించడం లేదు. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగిగా.. ఏయే ప్రాంతాల్లో తనిఖీలుంటాయి? ఎలా తప్పించుకోవాలి? కొండపైకి గంజాయి ఎలా చేర్చాలనే అంశాలపై అవగాహన కలిగినవాడు కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా అతడి కార్యకలాపాలు, గంజాయి ఎక్కడినుంచి తీసుకొస్తున్నాడు? వ్యవస్థీకృత ముఠాలేమైనా ఉన్నాయా? తదితర అంశాలపై దర్యాప్తు చేయాల్సి ఉంది.

పకడ్బందీ తనిఖీలతో మేలు

తిరుమల కొండపైకి వెళ్లేవారిని సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ చేస్తారు. ఇందులోని లోపాలను సరిదిద్ది నిఘా పటిష్ఠం చేయాల్సి ఉంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల ఉనికి ఏ మాత్రం ఉన్నా తెలుసుకోగలిగే తనిఖీ పరికరాలు, సాంకేతికత విమానాశ్రయాల్లో ఉంటాయి. అలాంటివి ఇక్కడా సమకూర్చుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని