తప్పని పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేయాలి: కృష్ణబాబు

తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సూచించారు.

Updated : 28 Mar 2023 06:17 IST

ఈనాడు, అమరావతి: తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సూచించారు. మంగళగిరిలో సోమవారం జరిగిన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల గైనకాలజిస్టులు, నిర్వాహకుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ధనార్జనే ధ్యేయంగా ఆస్పత్రుల్ని నడపొద్దు. ఎక్కువగా సిజేరియన్‌ ప్రసవాలు చేస్తే ఆరోగ్యశ్రీ గుర్తింపు రద్దు చేస్తాం. డబ్ల్యుహెచ్‌వో నిబంధనల ప్రకారం 10%-15% మాత్రమే సిజేరియన్లు జరగాలి. ముహూర్తాలు, తేదీలను పరిగణనలోకి తీసుకుని సిజేరియన్‌ చేయడం సరికాదు’’ అని పేర్కొన్నారు. 2,500 నుంచి మూడు వేల మంది జనాభా ఉన్న ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులను ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమించామని కృష్ణబాబు వెల్లడించారు. వారితోపాటు ఇద్దరు ఏఎన్‌ఎంలు, నలుగురు లేదా ఐదుగురు ఆశా కార్యకర్తలతో కూడిన బృందం ఉంటుందన్నారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ.. ఆయుష్మాన్‌ భారత్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని, ఇప్పటి వరకు 1.78 కోట్లకుగాను 1.1 కోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు. దీనికి వాలంటీర్లు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలోని ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్రాల్లో మాస్టర్‌ ట్రైనర్‌లను సమకూర్చుకోవాలని ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని