రాజధాని కేసులో.. హైకోర్టు తీర్పుపై స్టే నిరాకరణ

విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం ప్రస్తుత ఏపీ శాసనసభకు లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జులై 11కి వాయిదా పడింది.

Updated : 29 Mar 2023 10:14 IST

ఇంకాముందే విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తీ తిరస్కరణ
జులై 11కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఈనాడు - దిల్లీ

విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం ప్రస్తుత ఏపీ శాసనసభకు లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జులై 11కి వాయిదా పడింది. ఈ తీర్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధానులపై నిర్ణయం తీసుకోలేకుండా చేతులు కట్టేసినట్లయిందని, స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు  ధర్మాసనం తిరస్కరించింది. మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ కేఎం జోసెఫ్‌.. తాను జూన్‌ 17న పదవీ విరమణ చేస్తున్నందున ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విని, తీర్పు రాసేంత సమయం ఉండదని వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి కాజ్‌లిస్ట్‌లో పదోస్థానంలో ఉన్న ఈ కేసు విచారణ కోర్టు సమయంలోపు రాలేదు. దీనికంటే ముందున్న కేసుల విచారణ సుదీర్ఘంగా సాగింది. దాంతో చివరగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఈ కేసు గురించి ప్రస్తావించి, విచారణకు తేదీలు కేటాయించాలని కోరారు. ఆ సందర్భంగా జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ మే 19 నుంచి సెలవులు ఉన్నాయని గుర్తుచేయగా.. మే 11న తీసుకోవాలని వేణుగోపాల్‌ విజ్ఞప్తిచేశారు. అందుకు జస్టిస్‌ జోసెఫ్‌ జవాబిస్తూ ‘నేను జూన్‌ 17న పదవీవిరమణ చేయబోతున్నాను. అంత వేగంగా పనిచేయడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు.

తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హైకోర్టు తీర్పులోని అంశాలపై గతంలో పాక్షికంగా స్టే విధించారని, అయితే రాజధాని విషయంలో ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆందోళనతో ఉందని పేర్కొన్నారు. జస్టిస్‌ బీవీ నాగరత్న జోక్యం చేసుకుంటూ వాదనలు పూర్తిచేయడానికి మీకు ఎన్ని గంటలు అవసరమని ప్రశ్నించగా, నిరంజన్‌రెడ్డి బదులిస్తూ తాము ఒక్కరోజులో పూర్తిచేస్తామన్నారు. మిగతావారి వాదనలను మీరెలా నియంత్రించగలరని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. ఆ సమయంలో కేకే వేణుగోపాల్‌ జోక్యం చేసుకుంటూ ‘ఏ చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసులు దాఖలు చేశారో ఆ చట్టాలను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకొంది. దీనిపై విచారణ అవసరం లేదని తెలిపినా వినిపించుకోకుండా హైకోర్టు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలను ఆమోదించే అవకాశం ఉందన్న పేరుతో తీర్పు చెప్పింది. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి చట్టం ఆమోదిస్తే అది చెల్లదంది. ఇక్కడ హైకోర్టు అధికార విభజన రేఖను (సపరేషన్‌ ఆఫ్‌ పవర్‌)ను దాటి ప్రభుత్వం ఇలా చేయడానికి వీల్లేదని చెప్పింది. ఇది పూర్తిగా కోర్టు పరిధికి మించిన విషయం. కేవలం అకడెమిక్‌ అంశమే కాబట్టి మా వాదనలు వినిపించడానికి ఒక గంట సరిపోతుంది’’ అని ధర్మాసనానికి తెలిపారు. అమల్లో లేని చట్టంపై ఇచ్చిన తీర్పును రివర్స్‌ చేయాలని కోరారు. అప్పుడు జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ ఏప్రిల్‌ 11న విచారణ చేపట్టవచ్చా అని అడగ్గా.. వాదనలకు తాము గంట సమయమే తీసుకుంటామని వేణుగోపాల్‌ చెప్పారు. ఆ రోజు దీనికంటే ముందు 13 కేసులు ఉన్నాయని, అన్నీ ముఖ్యమైనవేనని, ఇది 14వ నంబరుగా వస్తుందని, ఏం జరుగుతుందో ఊహించుకోవాలని జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. అప్పుడు నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఏప్రిల్‌ 18న తొలి కేసుగా చేపట్టాలని కోరారు. ఇదివరకు దీన్ని టాప్‌ ఆఫ్‌ ద బోర్డుగా చేపడతామని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రతివాదుల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధర్‌ వాదిస్తూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అయిదుగురు ప్రతివాదుల్లో ఇప్పటికే ముగ్గురు కన్నుమూసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన దరఖాస్తు దాఖలుచేసి వారి వారసులకు నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. అందుకు నిరంజన్‌రెడ్డి బదులిస్తూ ఆ విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, దరఖాస్తు దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. తర్వాత మురళీధర్‌ జోక్యం చేసుకుంటూ కేసులో 256 మంది ప్రతివాదులున్నారని, అందరికీ నోటీసులు అందేలా చూడాలని కోరారు. అందరి వాదనలు విన్న తర్వాత జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ జులై 11న దీన్ని తొలి కేసుగా విచారణ చేపడతామని, తాము చేయగల మంచిపని అదొక్కటేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్‌ జోక్యం చేసుకుంటూ ఏపీ హైకోర్టు తీర్పు కారణంగా ప్రభుత్వం చేతులు కట్టేసినట్లయిందని, అందువల్ల దీనిపై స్టే ఇవ్వాలని కోరారు. కనీసం స్టే పిటిషన్‌నైనా విచారణకు స్వీకరించాలని కోరారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ తన చేతులూ కట్టేసి ఉన్నాయని నవ్వుతూ వ్యాఖ్యానిస్తూ వేణుగోపాల్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే విచారణ ముగించారు.


ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై అసహనం

మంగళవారం ధర్మాసనం ఇతర కేసులపై విచారణ చేపడుతుండగా మధ్యాహ్నం 2.40 సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డితో కలిసి మరో సీనియర్‌ న్యాయవాది నఫడే ధర్మాసనం ముందుకొచ్చి అమరావతి కేసు గురించి ప్రస్తావించారు. తాము ఇతర కేసులను వింటున్నామని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే తాము అమరావతి కేసుకు తదుపరి విచారణ తేదీని కోరుతున్నామని నఫడే విన్నవించారు. దానిపై జస్టిస్‌ జోసెఫ్‌ కొంత అసహనం వ్యక్తంచేశారు. ‘‘మేం కేసును వింటున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవద్దు. సుప్రీంకోర్టులో ఒక విధానం ఉంటుంది. ఇక్కడ మేం ఇప్పటివరకు పాక్షికంగా విన్న కేసుపై విచారణ చేపడుతున్నాం. దీనిగురించి మీలాంటివారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా’’ అని వ్యాఖ్యానించారు. దాంతో రాష్ట్రప్రభుత్వ న్యాయవాదులు మిన్నకుండిపోయారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు