పేదల ఇళ్ల నిర్మాణానికి సుస్థిర విధానం సూచించండి
ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు కడుతున్నామన్నారు.
విశాఖలో గడిపిన సమయం మధుర జ్ఞాపకంగా ఉంటుంది
‘జీ20’ సన్నాహక సదస్సుల్లో ముఖ్యమంత్రి జగన్
ఈనాడు, విశాఖపట్నం: ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు కడుతున్నామన్నారు. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తుందని వివరించారు. దీనిపై చక్కని చర్చలు జరిపి సుస్థిర విధానాలను సూచించాలని ప్రతినిధులను కోరారు. ‘జీ-20’ సన్నాహక సదస్సులు మంగళవారం విశాఖలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకూ ఇవి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజైన మంగళవారం ఏర్పాటు చేసిన ‘గాలా డిన్నర్’లో పాల్గొనడానికి మంగళవారం రాత్రి విశాఖకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘విశాఖలో గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నాను. ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంలా ఉంటుందని ఆశిస్తున్నా’ అని ముఖ్యమంత్రి అన్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ‘జి-20’కి వచ్చిన విదేశీ ప్రతినిధులను ప్రత్యేకంగా కలిశారు. అనంతరం ‘భోజ్ పర్ సంవాద్’ పేరుతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రణాళికగా అమలు చేస్తే ఫలితాలు: విశాఖ వేదికగా చేపట్టిన జి-20 దేశాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో తొలిరోజు ‘రేపటి ఆర్థిక నగరాలు’ అనే అంశంపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ నేతృత్వం వహించారు. మొదటి రోజు 14 సభ్య దేశాలు, 8 అతిథి దేశాలు, పది అంతర్జాతీయ సంస్థల నుంచి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా మార్చడం, మౌలిక వసతులకు ఆర్థిక సాయం చేయడం, భవిష్యత్‌లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటివి ప్రధానాంశాలుగా చర్చించారు. రెండో సెషన్‌లోనూ గంటన్నరపైగా విదేశాల్లో నగరాభివృద్ధికి అవలంభిస్తున్న పద్ధతులపై సలహాలు, సూచనలు చేశారు. 13 మంది అంతర్జాతీయ నిపుణులు మాట్లాడుతూ భవిష్యత్ నగరాలను రూపొందించడానికి మౌలిక సదుపాయాలకు అవసరమైన ఆర్థిక అంతరాన్ని పరిష్కరించడానికి ప్రైవేటు రంగ పెట్టుబడిని పెంచాలని సూచించారు. సాయంత్రం మౌలిక సదుపాయాల వర్గీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
నేడు విదేశీ ప్రతినిధులకు యోగా, ధ్యానం: ఈ సదస్సుల్లో రెండో రోజున బుధవారం ఉదయం 6.30 నుంచి 80 నిమిషాలపాటు పౌష్టికాహార వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. విదేశీ ప్రతినిధులకు బీచ్‌లో యోగా, ధ్యానంతోపాటు సాత్విక ఆహారాన్ని రుచి చూపించనున్నారు. అనంతరం నాలుగు సమావేశాలు నిర్వహిస్తారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో లేపాక్షి, చేనేత, హస్తకళలు, గిరిజన సహకార సంస్థ ఉత్పత్తుల స్టాల్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
‘జి-20 వసుధైక కుటుంబం’ పుస్తక ఆవిష్కరణ: ‘ఒకే భూమి..ఒకే కుటుంబం..ఒకే భవిష్యత్తు’ నినాదంతో రాసిన జి-20 వసుధైక కుటుంబం అనే పుస్తకాన్ని విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్‌లు ఆవిష్కరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
kishan reddy: హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్: కిషన్‌రెడ్డి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
-
India News
Odisha Train Accident: రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిల్..
-
India News
Odisha Train Accident: 1,000 మంది సిబ్బంది.. భారీ యంత్రాలతో ట్రాక్ పునరుద్ధరణ..
-
Sports News
Virat Kohli: విరాట్‌ను అడ్డుకోవడం అంత సులువేం కాదు: ఆసీస్ ఆల్‌రౌండర్