CM Jagan: సీఎం జగన్‌ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు

సీఎం జగన్‌ విశాఖ పర్యటన విజయవాడ నగరవాసులను మంగళవారం సాయంత్రం అష్టకష్టాలపాలు చేసింది.

Updated : 29 Mar 2023 07:44 IST

విజయవాడలోకి భారీ వాహనాలు.. ట్రాఫిక్‌ కష్టాలు
సీఎం పర్యటించాల్సిన విమానంలో సాంకేతిక లోపం

ఈనాడు, అమరావతి - గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ విశాఖ పర్యటన విజయవాడ నగరవాసులను మంగళవారం సాయంత్రం అష్టకష్టాలపాలు చేసింది. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాల్సిన ఆయన గంటన్నర ఆలస్యంగా బయలుదేరడంతో దాని ప్రభావం ట్రాఫిక్‌పై పడింది. సాయంత్రం ఎప్పుడూ రద్దీగా ఉండే విజయవాడ ప్రధాన వీధులు మరింత కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి వచ్చేస్తున్నారంటూ 3.30గంటల నుంచే ట్రాఫిక్‌ను నియంత్రించారు. షెడ్యూల్‌ ప్రకారం తాడేపల్లిలోని నివాసం నుంచి సాయంత్రం నాలుగింటికి జగన్‌ బయలుదేరాల్సి ఉంది. ఆ మేరకు పోలీసులు హడావుడి చేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను బెంజి సర్కిల్‌ మీదుగా తాడిగడప వంద అడుగుల రోడ్డుపైకి మళ్లించారు. దీని వల్ల బందరు రోడ్డుపై భారీ వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ల కొద్దీ రెండు వైపులా ఆగిపోయాయి. సాయంత్రం 4.30కు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైనా ట్రాఫిక్‌ నిలిపేశారు. ఎంతకీ సీఎం బయలుదేరకపోవడంతో చాలాసేపయ్యాక తిరిగి వదిలేశారు. ఆ రద్దీ అంతా ఒక్కసారిగా బెంజి సర్కిల్‌పై పడింది. ఈ సమయంలో ఇళ్లకు వెళ్లే వారు నరకం చవిచూశారు. ఐదు గంటల సమయంలో పోలీసులు మళ్లీ కాసేపు ట్రాఫిక్‌ ఆపారు. సమాచార లోపంతో పలు దఫాలు ట్రాఫిక్‌ నిలిపేయడం, వాహనాలను మళ్లించడం వల్ల అత్యధిక సమయం అవస్థలు తప్పలేదు. ఎట్టకేలకు సాయంత్రం 5.35కు ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి బయలుదేరారు. 6.03 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెళ్లాల్సిన ప్రత్యేక విమానం ఇంజిన్‌ ఆఫ్‌ కావడంతో సుమారు 11 నిమిషాలపాటు ముఖ్యమంత్రి కారులోనే వేచి ఉన్నారని అధికారులు తెలిపారు. లోపాన్ని విమానాశ్రయ సిబ్బంది సరిచేయడంతో 6.24 గంటలకు విశాఖ బయలుదేరారు. తిరిగి రాత్రి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి.. తాడేపల్లి నివాసానికి రోడ్డు మార్గంలో వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని