హైకోర్టు దారుల్లో వీధి లైట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదు?

విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టారని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Updated : 29 Mar 2023 04:46 IST

కోర్టుకొచ్చి వివరణ ఇవ్వండి
సీఆర్‌డీఏ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఇతర రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టారని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. హైకోర్టుకు చేరుకునే మార్గాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. రెండు నెలల్లో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని గతేడాది సెప్టెంబర్లో ఉత్తర్వులిచ్చారు. వాటిని అమలు చేయకపోవడంతో పిటిషన్‌దారు సీఆర్‌డీఏ కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశించినా దీపాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని