‘రాజధాని జోన్‌’ వ్యాజ్యాన్ని సీజే ముందు ఉంచండి

రాజధాని నగరం అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి(సీజే) ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశించారు.

Updated : 29 Mar 2023 05:15 IST

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశం

ఈనాడు, అమరావతి: రాజధాని నగరం అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి(సీజే) ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశించారు. న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ప్లాన్‌)లో మార్పులు చేసి ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దానిని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవల నందకిశోర్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యంపై జరిగిన విచారణలో పిటిషనర్‌ తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ గ్రామ సభలలో లేవనెత్తిన అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామస్థుల నుంచి ప్రతిపాదన లేకుండానే పంచాయతీ ప్రత్యేక అధికారి సీఆర్‌డీఏకి ప్రతిపాదన పంపడం సరికాదన్నారు. ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్‌డీఏ తరపున కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల మేరకే ఆర్‌-5 జోన్‌ రూపకల్పన చేశామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అభ్యంతరం ఎందుకన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని సూచించారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై తీసుకొచ్చిన సీఆర్‌డీఏ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నానన్నారు. ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపినా తమకు అభ్యంతరం లేదని అదనపు ఏజీ తెలిపారు. ఇరువురి అభ్యర్థనలనూ పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యాజ్యాన్ని  ప్రధాన న్యాయమూరి ముందు ఉంచాలని ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని