కాపులకు 5% రిజర్వేషన్‌పై వైఖరి తెలపండి

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు వ్యవహారంలో వైఖరి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Updated : 29 Mar 2023 05:26 IST

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కౌంటర్‌ వేయాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు వ్యవహారంలో వైఖరి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై గతంలో దాఖలైన అన్ని పిటిషన్లతో కలిపి ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారిస్తామని స్పష్టంచేసింది. విచారణను ఏప్రిల్‌ 26కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ఈడబ్ల్యూఎస్‌ కోటా 10%లో కాపులకు 5% రిజర్వేషన్‌ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో పిల్‌  వేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్‌లో 5% కాపులకు కేటాయిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు.

సుప్రీంకోర్టు సమర్థించింది: సీనియర్‌ న్యాయవాది

మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్‌ వాటాలో 5% రిజర్వేషన్లను కాపులకు కేటాయిస్తూ యాక్ట్‌ 14/2019ని తీసుకొచ్చారన్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా ఆ చట్టాన్ని సమర్థించిందన్నారు. కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పిస్తూ చేసిన చట్టం చెల్లుబాటవుతుందని చెప్పిందన్నారు. అది అమల్లో ఉందన్నారు. ఆ చట్టానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం జీవో 60 తీసుకొచ్చిందని వివరించారు. చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందన్నారు. వాస్తవానికి హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని.. జీవో 60తో ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కింద 5శాతం రిజర్వేషన్‌ వర్తించకుండా పోతోందన్నారు. ఈడబ్ల్యూఎస్‌కి 10శాతం రిజర్వేషన్లు కల్పించిన సమయంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లను కేటాయించుకునే హక్కు కేంద్రం కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం 10%లో కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తెచ్చిందన్నారు. చట్టం తెచ్చినప్పటికీ కాపులకు 5% రిజర్వేషన్‌ ఫలాలు దక్కడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది శివాజీ వాదనలు వినిపిస్తూ.. ఇదే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇది తీవ్ర వ్యవహారమని, గతంలో దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారిస్తామని పేర్కొంటూ కేసును ఏప్రిల్‌ 26కు వాయిదా వేసింది. కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు