ముందస్తు బెయిలు మంజూరు చేయండి

వివేకా హత్య కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 29 Mar 2023 05:36 IST

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా హత్యకేసులో సీబీఐ ముందు ఇప్పటికే పలుసార్లు హాజరై వాంగ్మూలం ఇచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్యకేసు విచారణలో భాగంగా సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో పలుసార్లు సీబీఐ విచారణకు హాజరై దర్యాప్తునకు పూర్తిగా సహకరించినట్లు వివరించారు. వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన టి.గంగిరెడ్డికి, దస్తగిరికి మధ్య వ్యవహారంలో తన పేరును ఇరికించారని చెప్పారు. వాచ్‌మెన్‌ రంగన్న, దస్తగిరిల వాంగ్మూలాల ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. రంగన్న వాంగ్మూలంలో గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిల పేర్లను వెల్లడించారన్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తనపై నేరం మోపడానికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. దర్యాప్తు సరైన కోణంలో జరగడంలేదని ఆరోపించారు. దర్యాప్తు అధికారి తనను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను పేర్కొంటూ హత్యతో తనకు ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించినప్పటికీ తనను అరెస్టు చేసే ప్రయత్నంలో సీబీఐ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌ ఇంకా రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు