అంతా ఆర్భాటమే!

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సదస్సులకు విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. అయితే మొదటి నుంచి హడావుడి చేసినా సదస్సు మొదలయ్యే సమయానికి విమర్శలు ఎదురయ్యాయి.

Updated : 29 Mar 2023 05:55 IST

‘జీ20’ సన్నాహక సదస్సులకు విదేశీ ప్రతినిధుల రాక స్వల్పమే
సౌకర్యాల కల్పనలోనూ తడబాటు
కొనసాగుతున్న సుందరీకరణ పనులు

ఈనాడు, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సదస్సులకు విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. అయితే మొదటి నుంచి హడావుడి చేసినా సదస్సు మొదలయ్యే సమయానికి విమర్శలు ఎదురయ్యాయి. సుమారు 40 దేశాల నుంచి 200 మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారని వైకాపా నేతలు, అధికారులు సమావేశాల్లో చెప్పుకొచ్చారు. అయితే తొలిరోజు 8 దేశాల నుంచి నలభై మంది ప్రతినిధులు హాజరు కాగా, ఐఎంఎఫ్‌, ఏడీబీ వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన మరికొందరు మాత్రమే హాజరైనట్లు సమాచారం. నమోదు చేసుకున్న కొందరు ప్రతినిధుల స్థానంలో వారి సహాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. సదస్సులకు వచ్చే ప్రతినిధులకు హోటల్‌లో గదులు ముందుగా కేటాయించారు. అయితే విమానాశ్రయం నుంచి హోటల్‌కు తీసుకెళ్లిన ప్రతినిధుల నుంచి మళ్లీ ప్రత్యేకంగా వివరాలు తీసుకుని, తనిఖీ చేసి గదులు కేటాయించడంతో జాప్యమైంది. దీంతో కొందరు ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొందరు ప్రతినిధులు హోటల్‌ ప్రాంగణంలో ఉన్న కోర్టులో బ్యాడ్మింటన్‌ ఆడాలని కోరగా, క్రీడా ప్రాంగణానికి తీసుకెళ్లేందుకు వారికి కేటాయించిన లైజనింగ్‌ అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందారు. విధులు కేటాయించిన అధికారుల తీరుపైనా పర్యవేక్షణ అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సుందరీకరణ... సాగుతూనే: ఈ సదస్సుల నేపథ్యంలో నగర సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ముందు నుంచే సుమారు రూ.150 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ‘జీ20’ సదస్సులు మొదలైనా నగరంలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఆర్కే బీచ్‌ రోడ్డు, ద్వారకా బస్టాండు, సాగరనగర్‌ బీచ్‌ సమీపంలో ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. రూ.10కోట్లతో కైలాసగిరిపై చేపట్టిన పనులు సైతం అసంపూర్తిగా ఉన్నాయి.

మళ్లీ హైరానా: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విమానాశ్రయం నుంచి రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లే మార్గంలో మంగళవారం సాయంత్రం పోలీసులు హడావుడి చేశారు. బీచ్‌రోడ్డులో ఫుట్‌పాత్‌లపై, ఖాళీ స్థలాల్లో ఉన్న చిరువ్యాపారులను ఖాళీ చేయించారు. రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో రహదారి పక్కన దుకాణాలను సీఎం పర్యటన ముగిసే వరకు తెరవొద్దన్నారనే విమర్శలొచ్చాయి. అలాగే అక్కయ్యపాలెం వద్ద మురికివాడలు కనిపించకుండా పరదాలు అడ్డుగా కట్టేశారు.

సివిల్‌ డ్రస్సులో పోలీసులు: విధులు నిర్వహించే పోలీసులు యూనిఫాంలో కాకుండా సివిల్‌ డ్రస్సులో రావాలని ఆదేశాలిచ్చారు. విదేశీ ప్రతినిధుల ముందు ఎక్కువ మంది ఖాకీ డ్రస్సుల్లో ఉంటే బాగోదన్న కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు లైజనింగ్‌ ఆఫీసర్లు, పోలీసులకు అందించిన ఆహారం నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని