అచ్చెన్నను మానసికంగా ఇబ్బంది పెట్టారా?

వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలోని జిల్లా బహుళార్ధ పశువైద్యశాల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది.

Published : 29 Mar 2023 05:23 IST

వీపీసీ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలోని జిల్లా బహుళార్ధ పశువైద్యశాల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. హత్యకు గురైన వీపీసీ డీడీ అచ్చెన్నను ఎవరైనా ఏమైనా అన్నారా? ఆయన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారా అని ఆ కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలోని సభ్యులు పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకులు సింహాచలం, వెంకట్రావు, సంయుక్త సంచాలకులు రత్నకుమారి మంగళవారం వీపీసీ కార్యాలయానికి వచ్చారు. అచ్చెన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా అధికారి కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో నిజనిర్ధారణ కమిటీ వచ్చి వెళ్లినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారిణి శారదమ్మను కూడా విచారించారు. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని సంచాలకులకు తెలియజేశానని, అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఆదేశాన్ని వీపీసీకి పంపుతూ వచ్చానని ఆమె వివరించినట్లు తెలిసింది. అనంతరం ఏడీలు శ్రీధర్‌లింగారెడ్డి, సుధీర్‌నాథ్‌ బెనర్జీలను వేర్వేరుగా విచారించారు. తమకు అచ్చెన్నకు వృత్తిపరమైన విభేదాలొచ్చిన మాట వాస్తవమేనని, అయితే హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని వారు కమిటీకి చెప్పినట్లు తెలిసింది. కమిటీ ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం అందరినీ ప్రశ్నించారని, అవసరమైన వారి నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని