హైదరాబాద్ అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబు
హైదరాబాద్ అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబునాయుడు అని ఏపీ తెదేపా అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
పార్టీ ఆవిర్భావ సభలో నాయకులు
హైదరాబాద్, న్యూస్‌టుడే: హైదరాబాద్ అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబునాయుడు అని ఏపీ తెదేపా అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అమెరికా, సింగపూర్ దేశాల్లోని పట్టణాలను తలపించేలా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబునాయుడు విజన్ కారణమని అన్నారు. హైదరాబాద్ లాంటి నగరంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు పూనుకుంటే.. ఒక్క అవకాశమంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజలు తమకు జరిగిన మోసాన్ని తెలుసుకున్నారనడానికి ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు కలిసి ఉండాలనే లక్ష్యంతో తెదేపా ముందుకు సాగుతుందన్నారు.
నాటి విత్తనాలే నేటి ఫలాలు: కాసాని
‘తెలుగు రాష్ట్రాల్లో పేదలు, బలహీనవర్గాలు, యువత, మహిళల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు అనేక అవకాశాలు కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధికి తెదేపా హయాంలో నాటిన విత్తనాలు నేడు పండ్లుగా మారాయి’ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీని గ్రామగ్రామానికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెదేపా హయాంలో బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించడం వల్ల తనలాంటి అనేకమందికి అవకాశాలొచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు హయాంలో విజన్-2020 ప్రణాళిక ద్వారా చేపట్టిన అభివృద్ధి తరతరాలకు నిలిచిపోతుందన్నారు.
తెదేపా ఒక శక్తి: రామ్మోహన్‌నాయుడు
తాను న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే సమయంలో.. ఇక్కడ కర్ఫ్యూ ఉందా? అని తెలుసుకునేవాడినని పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అలాంటి హైదరాబాద్‌ను కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే నగరంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని జయించే శక్తిని యువతకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. తెదేపా అండమాన్ నికోబార్ అధ్యక్షుడు మాణిక్‌రావు యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని తెలుగువారంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రి బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గ పరిపాలన కొనసాగుతోందని, ఆ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్‌కుమార్‌గౌడ్, రామానాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నేతలు నన్నూరి నర్సిరెడ్డి, అలీ మస్కతి తదితరులు ప్రసంగించారు. పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 17 మంది నేతలను సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు.
ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళి
తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌ను దర్శించుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయులు రామకృష్ణ, బాలకృష్ణ, పార్టీ నేతలు మాగంటి బాబు, కంభంపాటి రామ్మోహన్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి, తెతెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పార్టీ ముఖ్యనేతలు ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో తెలంగాణ తమ్ముళ్లలో నూతనోత్సాహం నెలకొంది. సభకు రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే సభా ప్రాంగణానికి వారి రాక మొదలైంది. మంగళవారం పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించిన తెదేపా, బుధవారం ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించింది. హైదరాబాద్‌లో రెండు ముఖ్య కార్యక్రమాల్ని వరుసగా నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సభా ప్రాంగణంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సుమారు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కృషిని, ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు.
బాలయ్య పద్యాలు, పంచ్ డైలాగ్‌లు..
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన వేదికపైకి వచ్చేసరికి సభలో ‘జై బాలయ్య’ నినాదాలు మిన్నంటాయి. బాలకృష్ణ ప్రసంగంలో పద్యాలు, పంచ్ డైలాగ్‌లతో అదరగొట్టారు. పార్టీని మొదటి నుంచీ భుజస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్నారని అభినందించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావును దైవాంశ సంభూతుడిగా, తన దైవంగా సంబోధిస్తూ.. ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన సేవలను బాలకృష్ణ గుర్తుచేశారు. ఎన్టీఆర్ పేరిట ఉన్న వైద్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే నేడు హైదరాబాద్ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే స్థాయికి ఎదిగిందని బాలకృష్ణ అన్నారు. ‘చరిత్ర మరిచిన వారు తల్లి పాలు తాగి విషం చిమ్మిన వారితో సమానం’ అని వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!
-
Movies News
Social Look: ఐస్‌క్రీమ్‌తో రకుల్‌ప్రీత్.. చెప్పుతో తేజస్విని.. తమన్నా ప్రచారం!