ప్రత్యేక హోదాపై కేంద్రం మౌనం

దేశంలో ఇక నుంచి ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందా? అలాగైతే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ పరిస్థితి ఏమిటి అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు కేంద్రం నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది.

Published : 30 Mar 2023 04:42 IST

విజయసాయిరెడ్డి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వని మంత్రి

ఈనాడు, దిల్లీ: దేశంలో ఇక నుంచి ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందా? అలాగైతే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ పరిస్థితి ఏమిటి అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు కేంద్రం నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. రాజ్యసభలో ఆయన అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ఎప్పుడూ చెప్పే సమాధానమే చెప్పారు. ‘రాష్ట్రాలకు పన్నువాటా పంపిణీలో ప్రత్యేక రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసమూ చూపలేదు. ఆ కమిషన్‌ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం 2015-20 మధ్యకాలంలో రాష్ట్రాలకు పంచే పన్ను వాటాను 32% నుంచి 42%కి పెంచింది. 15వ ఆర్థిక సంఘం కూడా దానినే కొనసాగించింది. రాష్ట్రాలకు ఎదురయ్యే వనరుల లోటును సాధ్యమైనంత మేరకు పన్నువాటా పంపిణీ ద్వారా భర్తీ చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. ఒకవేళ పన్నువాటా పంపిణీ తరవాత కూడా వనరుల లోటు ఏర్పడిన రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ గ్రాంట్స్‌ అందిస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో ఇచ్చి ఉంటే 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు అదనపు కేంద్ర సాయం ఎంత వచ్చి ఉండేదో అంత ప్రత్యేక సాయం (ప్యాకేజీ) కింద ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలు, వడ్డీ చెల్లింపుల ద్వారా ఆ సాయం అందిస్తామని చెప్పింది. కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘం సిఫార్సు మేరకు ప్రస్తుతం 8 ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లకు కేంద్ర ప్రాయోజిత పథకాల్లోని ముఖ్య పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90-10% ప్రకారం, మిగిలిన రాష్ట్రాలకు 60-40% ప్రకారం నిధులు సమకూరుస్తున్నాయి’ అని కేంద్రమంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని