ఇలా అయితే...‘ఫెర్రో’ పరిశ్రమలు నడపలేం

ఇప్పటికే మార్కెట్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఫెర్రో పరిశ్రమలపై విద్యుత్తు డిమాండ్‌ ఛార్జీలు విధించడం వల్ల మనుగడకే ప్రమాదం ఏర్పడిందని ‘ఫెర్రో అల్లాయ్‌’ ఉత్పత్తిదారుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 30 Mar 2023 05:38 IST

ఏడాదిలో యూనిట్‌పై రూ.2.41 పెంచారు
మిగతా రాష్ట్రాల్లో చౌకధరలకే విద్యుత్తు సరఫరా
‘ఏపీ ఫెర్రో అల్లాయ్‌’ ఉత్పత్తిదారుల సంఘ నేతల ఆవేదన

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఇప్పటికే మార్కెట్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఫెర్రో పరిశ్రమలపై విద్యుత్తు డిమాండ్‌ ఛార్జీలు విధించడం వల్ల మనుగడకే ప్రమాదం ఏర్పడిందని ‘ఫెర్రో అల్లాయ్‌’ ఉత్పత్తిదారుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఫెర్రో రంగంపై విద్యుత్తు ఛార్జీల భారాన్ని వారు వివరించారు. సంఘం ఛైర్మన్‌, ఫేకర్‌ ఎండీ ఆర్‌కే షరాఫ్‌ మాట్లాడుతూ... ‘ఫెర్రో ఉత్పత్తి ఖర్చులో 35 నుంచి 70 శాతం విద్యుత్తుపైనే ఉంటుంది. టారీఫ్‌ ఛార్జీలను పెంచడం వల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఈ పరిశ్రమను ప్రత్యేక కేటగిరీగా గుర్తించి 2002లోనే డిమాండ్‌ ఛార్జీల వసూళ్లను నిలిపేశారు. అందువల్లే అప్పట్లో ఆరు పరిశ్రమలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 39కి చేరింది. దశాబ్దం తర్వాత మళ్లీ ఈ ఛార్జీలను పునరుద్ధరించడం వల్ల దాదాపు రూ.300 కోట్ల మేర ఈ రంగంపై భారం పడుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే యూనిట్‌కు రూ.5.01 నుంచి రూ.7.42 పెరిగింది. ఇక్కడి కంటే ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో తక్కువ ధరకే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. మలేసియా వంటి దేశాల్లో యూనిట్‌ రూ.3 కంటే తక్కువకే ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఈ రంగం ఉపాధిని కల్పిస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది...’ అని పేర్కొన్నారు. కిలో వాట్‌కు రూ.475 చొప్పున విధించిన డిమాండ్‌ ఛార్జీలను తొలగించడంతో పాటు యూనిట్‌పై గతేడాది నుంచి వసూలు చేస్తున్న ఎలక్ట్రిసిటీ డ్యూటీని రూపాయి నుంచి ఆరు పైసలకు తగ్గించాలని కోరారు. ట్రూఆప్‌, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలను చెల్లించడానికి తాము సుముఖంగానే ఉన్నట్లు వెల్లడించారు.

టన్నుకు రూ.10 వేల భారం

132 కేవీ సామర్థ్యంతో నిర్వహించే పరిశ్రమలపై ప్రస్తుత టారీఫ్‌తో ఉత్పత్తులు కొనసాగిస్తే ఫెర్రోక్రోమ్‌, సిలికో మాంగనీసు ఉత్పత్తుల ఖర్చు టన్నుకు రూ.10 వేలు పెరుగుతుందని డెక్కన్‌ ఫెర్రో అల్లాయిస్‌ ఎండీ పీఎస్సార్‌ రాజు పేర్కొన్నారు. ఆ మేరకు మార్కెట్‌లో వీటి ధరలు పెరగడం లేదన్నారు. ఆ నష్టమంతా యాజమాన్యాలే భరించాల్సి రావడంతో పరిశ్రమ మనుగడకే ముప్పు ఏర్పడుతుందన్నారు. అదే జరిగితే విద్యుత్తు బిల్లుల రూపంలో డిస్కంలు ఏడాదికి రూ.3 వేల కోట్ల మేర నష్టపోతాయని, వేలాది మంది ఉపాధి కోల్పోవడంతో పాటు అనుబంధ పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ఫెర్రో ఉత్పత్తులతో నెలకు రూ.1200 కోట్ల వ్యాపారం జరుగుతుందని, దీనివల్ల ప్రభుత్వాలకు రూ.216 కోట్లు జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తుందని, రూ.600 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోందని వివరించారు.  సంఘం ప్రధాన కార్యదర్శి, ఫేకర్‌ సీఈవో ఎంఎస్‌ శర్మ, బెర్రి అల్లాయిస్‌ ఎండీ విజయ్‌గుప్తా, ఇతర నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు