కువైట్‌కు విమాన సర్వీసు ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా కువైట్‌కు ప్రత్యేక విదేశీ సర్వీసును బుధవారం అధికారులు ప్రారంభించారు.

Published : 30 Mar 2023 05:38 IST

ముందుగా వెళ్లిన విమానం
16 మంది ప్రయాణికులు వెనక్కి

ఈనాడు, అమరావతి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా కువైట్‌కు ప్రత్యేక విదేశీ సర్వీసును బుధవారం అధికారులు ప్రారంభించారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థ ప్రతి బుధవారం ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు రావడం అభినందనీయమని, అక్టోబరు 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసు కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఉదయం 9.55 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 66 మంది ప్రయాణికులతో విమానం కువైట్‌కు బయలుదేరి వెళ్లింది. తిరిగి రాత్రి 8.35 గంటలకు విజయవాడ చేరుకుంది. అయితే ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు తమకు.. మధ్యాహ్నం 1.10కి విమాన షెడ్యూల్‌ ఇచ్చి ఉదయం 9.55 గంటలకే విమానం వెళ్లిపోవడం ఏమిటని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మారిన సమయంపై సమాచారం ఇవ్వకపోవడంపై సంస్థ ప్రతినిధుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. విమానం బయలుదేరు సమయం మారిందన్న  విషయాన్ని వ్యక్తిగత మెయిల్స్‌, సెల్‌ఫోన్లతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశామని చెప్పారు. సమాచార లోపం కారణంగా కువైట్‌ వెళ్లాల్సిన 16 మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని