YSRCP: దోచుకో.. పంచుకో.. తినుకో!
గతంలో పాలకులు ఎలా ఉండేవారంటే.. వారిది పెత్తందారుల పరిపాలన. గత ప్రభుత్వ హయాంలో వారంతా కలసి.. దోచుకో, పంచుకో, తినుకో అన్న పద్ధతిలో డీపీటీ స్కీం అమలు చేసేవారు. మన ప్రభుత్వంలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్. నేరుగా ఇక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు.
వైకాపా ‘ముఖ్య నేతల’ గుప్పిట్లో ఇసుక దందా
జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సిండికేట్లు
నియోజకవర్గాల్లో స్థానిక నాయకులకు వాటాలు
‘ముఖ్యనేతలకు’ సిండికేట్ల నుంచి రూ.కోట్లలో అడ్వాన్సులు
నెలకు ఇన్ని కోట్లని లక్ష్యాలు విధించి మరీ వసూళ్లు
అత్యధికంగా ఉమ్మడి తూ.గో.జిల్లాలో నెలకు రూ.35 కోట్లు
రికార్డుల్లోనే జేపీ, టర్న్‌కీ సంస్థలు
వ్యాపారం చేసేది మాత్రం వైకాపా నేతలే
ఈనాడు - అమరావతి
గతంలో పాలకులు ఎలా ఉండేవారంటే.. వారిది పెత్తందారుల పరిపాలన. గత ప్రభుత్వ హయాంలో వారంతా కలసి.. దోచుకో, పంచుకో, తినుకో అన్న పద్ధతిలో డీపీటీ స్కీం అమలు చేసేవారు. మన ప్రభుత్వంలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్. నేరుగా ఇక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు.
...ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఎక్కడ మాట్లాడినా ఇదే మాట. శాసనసభలోనూ పదేపదే ఇదే పాట. ప్రతిపక్షాలపైనా, ప్రశ్నించేవారిపైనా అభాండాలు వేసేందుకు.. తమది నిప్పులాంటి ప్రభుత్వమని ప్రజల్ని నమ్మించేందుకు ఆయన పదే పదే చేస్తున్న ప్రచారం ఇది. కానీ జగన్ చెబుతున్న డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో)పై పేటెంట్ వైకాపా నాయకులదేనని రాష్ట్రంలో ఇసుక దోపిడీని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న, వందల కోట్ల రూపాయల ఇసుక దందాను వైకాపా ‘ముఖ్య నేతల’ నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో అర్థం కావాలంటే ఆ విషవృక్షం మూలాలు ఎంత కిందికి చొచ్చుకుపోయాయో, ఆ అవినీతి దందాలో ఎంత మంది ఎలా భాగస్వాములయ్యారో తెలుసుకోవాల్సిందే. ఉన్నత కుటుంబానికి చెందిన విద్యావంతుడైన ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి ఆ డీపీటీ విషవలయంలో చిక్కుకుని, దాన్ని నడిపిస్తున్న అధికార పార్టీ ‘ముఖ్య నేతలు’ నిర్ణయించిన నెలవారీ లక్ష్యాల ప్రకారం డబ్బు కట్టలేక, ఎలా బలవన్మరణానికి పాల్పడ్డాడో తెలుసుకోవాలి!
నేతల జేబుల్లోకి రూ.1,035 కోట్లు?
ఇసుక వ్యాపారులు, రవాణాదారులు, స్థిరాస్తి రంగ నిపుణులు, అనుభవజ్ఞులు, అనధికారిక వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం.. వైకాపా ‘ముఖ్య నేతలు’ జిల్లా సిండికేట్‌ల నుంచి సంవత్సరానికి సుమారు రూ.1,800 కోట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టి, మిగతా రూ.1,035 కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారు. జిల్లాల్లో ఇసుక వ్యాపారం చేస్తున్న వైకాపా నేతల నుంచి ఈ సొమ్మంతా.. డబ్బు మూటల రూపంలో హైదరాబాద్‌లో మకాం వేసిన ‘ముఖ్యనేత’లకు డైరెక్టుగా ట్రాన్స్‌ఫర్ అవుతోందని ఇసుక వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా వైకాపా నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నా.. రికార్డుల్లో మాత్రం జేపీ, టర్న్‌కీ సంస్థలే వ్యాపారం చేస్తున్నట్లు నమోదవుతోంది.
ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘మనీ హీస్ట్’ అనే వెబ్‌సిరీస్ మంచి ఆదరణ పొందింది. స్పెయిన్‌లో కొందరు హైటెక్ దొంగలు నగదు ముద్రణ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని... భారీగా డబ్బులు ముద్రించేసుకుని, వాటితో పరారవుతారు. మన రాష్ట్రంలో ‘శాండ్ హీస్ట్’లో చేయి తిరిగిన వైకాపా నాయకులు మాత్రం ఎక్కడికీ పరారవరు. పదవుల్లో కొనసాగుతూ, పెత్తనం చేస్తుంటారు. ‘ఎవరైనా కోపంగా కొడతారు. బలంగా కొడతారు. వీడేంట్రా పద్ధతిగా కొట్టాడు. ఏదో మొక్కకు అంటుకట్టినట్టు, గోడకట్టినట్టు’ అని ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పినట్లు వైకాపా నాయకులు ఎంతో ‘పద్ధతి’గా ఇసుక దందా చేసుకుంటున్నారు! కంపెనీలు జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లను, క్షేత్రస్థాయిలో విక్రయదారుల్ని పెట్టుకున్నట్టుగా.. అధికార పార్టీ నాయకులు జిల్లాలవారీగా ఎమ్మెల్యేల్ని, ఇతర ముఖ్యనేతల్ని ‘డీలర్లు’గా పెట్టుకుని ఇసుక దందాను వ్యవస్థీకృతం చేసేశారు. ఇసుక వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం వైకాపా నాయకులు ఇసుకలో డీపీటీని ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారంటే..
దోచుకో
రాష్ట్ర స్థాయిలో వైకాపా ‘ముఖ్య నేతలు’ మొత్తం ఇసుక దందాను గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లాల వారీగా వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, లేదా వారి బంధువులు, ఇసుక వ్యాపారంలో అనుభవజ్ఞలు, అత్యంత సన్నిహితులతో సిండికేట్లు ఏర్పాటు చేశారు. ఆ సిండికేట్లు జిల్లాల్లోని ఇసుక రేవుల్ని స్థానిక వైకాపా నేతలకు పంచేశాయి. వారంతా తవ్వగలిగినంత తవ్వేసి, దోచేసుకుంటున్నారు.
పంచుకో
వైకాపా ముఖ్య నేతలు.. జిల్లాలవారీ సిండికేట్ల నుంచి రూ.కోట్లలో అడ్వాన్సులు వసూలు చేశారు. నెలవారీ ఎంత కట్టాలో సిండికేట్లకు లక్ష్యాలు నిర్ణయించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక సిండికేట్ నిర్వహిస్తూ, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రేమ్‌రాజు నుంచే రూ.25 కోట్లు డిపాజిట్‌గా తీసుకున్నారని, ప్రతి నెలా రూ.21 కోట్లు కట్టాలని టార్గెట్ పెట్టారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అత్యధికంగా ఇసుక విక్రయాలు జరిగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రూ.35 కోట్లు, కృష్ణా జిల్లాకు రూ.18 కోట్లు, గుంటూరుకు రూ.17 కోట్లు, శ్రీకాకుళానికి రూ.16 కోట్లు.. ఇలా ప్రతి జిల్లాకు నెలవారీ లక్ష్యాలు విధించారు. జిల్లా స్థాయిలో ఇసుక వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నాయకులు.. ‘ముఖ్య నేతలకు’ నెలవారీ కట్టాల్సిన డబ్బుతో పాటు, వారు మరింత సంపాదించేందుకు ఆయా జిల్లాల్లోని ఇసుక రేవులకు, ఇంత మొత్తమని ధర నిర్ణయించి స్థానిక వైకాపా నాయకులకు అప్పగించారు. ఇక వాళ్లు ఎంత తవ్వగలిగితే అంతవరకు ఇసుక తవ్వేస్తున్నారు. ఇలా అధికార పార్టీ స్థానిక నాయకుల నుంచి, రాష్ట్ర స్థాయి ‘ముఖ్యుల’ వరకు పంచేసుకుంటున్నారు.
తినుకో
జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక వ్యాపారాన్ని అప్పగించినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతాయని గనులశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు వైకాపా నాయకులు ఎంత ఇసుక తవ్వుతున్నారో లెక్కాపత్రం లేదు. వారిని అడ్డుకునేవారుగానీ, అటువైపు కన్నెత్తి చూసేవారు గానీ లేరు. గనులశాఖ, ప్రత్యేక కార్యదళం (సెబ్), పోలీసు యంత్రాంగం.. ఇసుక రేవుల్లో ఏం జరుగుతోందో పట్టించుకోదు. లారీలకు లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నా అడ్డుకునేవారూ లేరు. జిల్లాల నుంచి నెలకు సగటున రూ.150 కోట్ల చొప్పున, ఏడాదికి రూ.1,800 కోట్లు అధికార పార్టీ ‘ముఖ్య నేతల’కు వెళుతున్నట్టు ఇసుక వ్యాపారులు చెబుతున్నారు. దానిలో రూ.765 కోట్లు ప్రభుత్వానికి కట్టి, మిగతా మొత్తం వారు తినేస్తున్నారు. ‘ముఖ్యనేతల’కు నెలకు రూ.150 కోట్లు కడుతున్నారంటే, జిల్లా స్థాయి సిండికేట్లు నడుపుతున్న, ఇసుక రేవుల్ని నిర్వహిస్తున్న వైకాపా నాయకులు ఇంకెన్ని కోట్లు తినేస్తున్నారో లెక్క లేదు.
దోపిడీ క్రమం ఇదీ..
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని 2021 మే నుంచి జేపీ పవర్ వెంచర్స్ అనే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. అధికార పార్టీ ముఖ్యనేతలకు సన్నిహితుడిగా పేరున్న చెన్నై మైనింగ్ వ్యాపారి తెర వెనుక ఉండి ఏర్పాటు చేయించిన ‘టర్న్‌కీ’ సంస్థ ఉపగుత్తేదారుగా రంగప్రవేశం చేసింది. ‘పెద్దల’ ఆశీస్సులతో టర్న్‌కీ సంస్థ ఇసుక వ్యాపారం మొత్తాన్ని శాసించింది. రేవుల్లో సిబ్బందిని కూడా తమిళనాడు వారినే నియమించింది.
* టర్న్‌కీ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు ఇష్టారాజ్యంగా సాగాయి. ఎంత తవ్వారో, ఎంత అమ్మారో లెక్కాపత్రం లేదు. అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు లేవు. అక్రమంగా ఇసుకను అమ్ముకోగా వచ్చిన భారీ మొత్తం అధికార పార్టీ ముఖ్యులకు వెళ్లేదనే ఆరోపణలున్నాయి.
* ప్రభుత్వం రేవులో వినియోగదారులకు టన్ను ఇసుక ధరను రూ.475గా నిర్ణయించింది. గుత్తేదారు సంస్థ దానిలో రూ.375 ప్రభుత్వానికి చెల్లించాలి. మిగతా వంద రూపాయల్లో నిర్వహణ ఖర్చులకు రూ.64 పోగా, గుత్తేదారు సంస్థకు రూ.36 మిగులుతుందని అధికారులు అప్పట్లో లెక్కలు చెప్పారు. రాష్ట్రంలో సగటున ఏడాదికి 2 కోట్ల టన్నులకు పైగా ఇసుక విక్రయాలు జరుగుతాయని అంచనా వేశారు. టన్నుకు రూ.475 చొప్పున సుమారు రూ.965 కోట్లు వసూలవుతుందని, దానిలో రూ.765 కోట్లు ప్రభుత్వానికి చెల్లించగా, నిర్వహణ ఖర్చుల కింద రూ.128 కోట్లు పోగా, గుత్తేదారు సంస్థకు ఏడాదికి రూ.72 కోట్లు మాత్రమే మిగులుతుందని చెప్పారు. కానీ ఎన్ని లక్షల టన్నులు తవ్వారో, ఎంత దోచుకున్నారో లెక్కా పత్రం లేదు.
* టర్న్‌కీని పంపేసి, సొంతంగా దందా నడిపితే ఇంకా ఎక్కువ తినేయొచ్చని అధికార పార్టీ ‘ముఖ్య నేతలు’ ఆలోచించారు. నిరుడు ఆగస్టులో టర్న్‌కీ సంస్థను ఉన్నపళంగా తొలగించారు. ఇసుక దందా మొత్తం తామే నడిపిస్తూ.. రికార్డుల కోసం రెండు సంస్థల్ని ఉపగుత్తేదారులుగా తెరపైకి తెచ్చారు. జీఎస్టీ తదితర అధికారిక చెల్లింపుల్లో సమస్యలు తలెత్తడంతో.. ఉపగుత్తేదారుగా మళ్లీ టర్న్‌కీని రంగంలోకి దించారు.
అంతా అనధికారిక దందానే!
రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. కానీ రికార్డుల్లో ఇసుక వ్యాపారం చేస్తున్న ప్రధాన గుత్తేదారుగా జేపీ పవర్ వెంచర్స్, ఉపగుత్తేదారుగా టర్న్‌కీ సంస్థల పేర్లే ఉంటాయి. కొనుగోలుదారులకు రసీదులూ ఆ సంస్థల పేరు మీదే ఇస్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును ఆ సంస్థలే కట్టినట్టుగా చూపిస్తారు. ఆ సంస్థల ప్రతినిధులెవరూ.. ఇసుక వ్యాపారంలో కనిపించరు. వైకాపా నాయకులే అంతా నడిపిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా తినేసేందుకే నగదు లావాదేవీలు!
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే.. అసలు లెక్కలు తెలిసిపోతాయన్న ఉద్దేశంతోనే రేవుల్లో నగదు తీసుకుని మాత్రమే ఇసుక లోడ్ చేస్తున్నారు. జిల్లాల్లో ఇసుక వ్యాపారం చేస్తున్న సిండికేట్‌లు ‘ముఖ్య నేతల’కు తాము కట్టాల్సిన మొత్తాన్ని కూడా మూటలు కట్టి నెలలో రెండుసార్లు హైదరాబాద్‌లో ఇస్తున్నట్టు ఇసుక వ్యాపారులు చెబుతున్నారు. ఇసుక వ్యాపారం ఆశించినంతగా సాగడం లేదని, నెలవారీ కట్టాల్సిన మొత్తాన్ని కొంత తగ్గించాలని సిండికేట్ నిర్వాహకులు కోరినా ముఖ్య నేతలు అంగీకరించడం లేదని, ‘నచ్చితే ఉండు, లేకపోతే వేరొకరికి అప్పగిస్తాం’ అని తేల్చి చెప్పేస్తున్నారని సమాచారం. ఆ క్రమంలోనే ఇసుక వ్యాపారంలో నష్టపోయిన ప్రేమ్‌రాజు నెలవారీ కట్టాల్సిన సొమ్మును రెండు మూడు నెలలపాటు పూర్తిగా చెల్లించలేకపోయారు. దాంతో ముఖ్యనేతలు మిగతా మొత్తాన్ని అతను కట్టిన డిపాజిట్ నుంచి మినహాయించుకున్నారు. అతణ్ని ఇసుక వ్యాపారం నుంచి తప్పించారు. దాంతో దారిలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు సన్నిహితులు చెబుతున్నారు.
లుకలుకలతో బయటపడుతున్న డీపీటీ!
* జిల్లాల్లో ఇసుక సిండికేట్‌లు నిర్వహిస్తున్న అధికార పార్టీ నాయకుల మధ్య నగదు పంపకాలు, వాటాల విషయాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇసుకలో ‘డీపీటీ’ ఏ స్థాయిలో జరుగుతోందో ఈ వివాదాలతోనే బయటపడుతోంది.
* ఉమ్మడి గుంటూరు జిల్లా ఇసుక సిండికేట్‌ను కృష్ణా తీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారు. గతంలో ఆయనే ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ... తన అనుచరుడితో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేయించారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే ఇసుక వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఎన్జీటీలో కేసు వేసిన అనుచరుడికీ, ఆయనకూ విభేదాలు తలెత్తాయి. ఎన్జీటీతో కేసుతో ఎమ్మెల్యేకి సంబంధం లేదని, సొంత నిర్ణయంతోనే వేశానని చెప్పాల్సిందిగా ఇప్పుడు తనపై ఒత్తిడి తెస్తున్నారని, అంగీకరించలేదని తనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుతో పాటు మరో కేసూ బనాయించారని ఆయన విలేకర్ల సమావేశంలో వాపోయారు. కానీ ఆ వ్యక్తే రెండేళ్లపాటు అక్రమ ఇసుక వ్యాపారం చేశారని, దాన్ని అడ్డుకున్నందుకే తమ నేతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సన్నిహితులిద్దరు విలేకర్లకు చెప్పారు.
* అదే ఎమ్మెల్యేకి ఇసుక వ్యాపారంలో కీలక భాగస్వామిగా ఉన్న వైకాపా నేత ఒకర్ని... ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయించినట్టు సమాచారం.
* ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక సిండికేట్‌ను కొన్ని రోజుల క్రితం వరకు పశ్చిమ కృష్ణాలోని కీలక ప్రజాప్రతినిధి నిర్వహించేవారు. అప్పట్లో ఆయన అనుమతి లేకుండా ఓ మండల పార్టీ అధ్యక్షుడు, స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మున్నేరులో యథేచ్ఛగా ఇసుక తవ్వారు. గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు, సెబ్కి ఫిర్యాదు చేశారు.
* ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇసుక దందా మొత్తాన్ని ఒక మాజీ ఎమ్మెల్యేకి అప్పగించారు. ఒక కీలక నియోజకవర్గ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ఎవరూ ఇసుక వ్యాపారం చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఖాతరు చేయకుండా, ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. వారి రీచ్ నుంచి వెళుతున్న ఇసుక లారీ ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దానిపై స్థానిక ఎమ్మెల్యే పెద్ద గొడవ చేయించారు. చివరకు మాజీ ఎమ్మెల్యే రాజీకొచ్చి ఇసుక వ్యాపారాన్ని వదులుకున్నారు.
* ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. రాజమహేంద్రవరం చుట్టుపక్కల పడవ ర్యాంపుల్లో ఇసుక వ్యాపారాన్ని ఓ రవాణాదారు నిర్వహిస్తున్నారు. మిగతా నియోజకవర్గాలన్నింటిలో సిండికేట్‌గా ఏర్పడి ఇసుక వ్యాపారం చేస్తున్నారు. అక్కడ తరచూ వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. దీనిపై ‘ముఖ్య నేతల’కు ఫిర్యాదులు వెళుతున్నాయి. వారు సర్దుబాటు చేస్తున్నారు.
రాజధానిలో వైకాపా ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో యథేచ్ఛగా డీపీటీ
మూడున్నరేళ్లుగా నన్ను అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో ఇసుక, మైనింగ్ మాఫియాలకు తెగబడి భారీగా ముడుపులు దండుకున్నారు. మా ముఖ్యమంత్రి జగన్.. దోచుకో, పంచుకో, తినుకో అని ప్రతిపక్షాలను ఉద్దేశించి అంటుంటారు. మరి ఉద్ధండరాయునిపాలెం నుంచి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఇసుక లారీలు వెళుతున్నాయో చూస్తూనే ఉన్నారు. ఆ డబ్బులన్నీ ఎవరు పంచుకుంటున్నారో, ఎవరు తింటున్నారో మీకు తెలుసు. అలాంటి ప్రజాప్రతినిధుల్ని బినామీలుగా పెట్టుకుని దందాలు సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నేను ముక్కుసూటిగా వెళతానని, ఎవరి మాటా విననని, వారిలా అక్రమాలు చేయనని, సాయంత్రానికి డబ్బు సంచులు తీసుకెళ్లి అందరికీ పంచను కాబట్టి... నన్ను పక్కన పెట్టాలని, ఇక్కడి నుంచి తొలగించాలని అనుకున్నారు.
వైకాపా నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
అంతా.. ఆ ప్రజాప్రతినిధి ఇష్టం!
రాజధాని అమరావతి పరిధిలో ప్రస్తుతం అధికారికంగా ఇసుక రీచ్‌లు లేవు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున అక్రమ ఇసుక దందా జరుగుతోంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో ఎన్ని విధానాలు మారినా ఇక్కడ మాత్రం ఆయనదే దందా. జేపీ సంస్థ ఫిర్యాదుతో ప్రత్యేక కార్యదళం (సెబ్) దాడులు నిర్వహించడంతో దీనికి తాత్కాలిక విరామం ఇచ్చిన ఆ ప్రజాప్రతినిధి... కొన్నాళ్లకే మళ్లీ మొదలెట్టేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం ఇసుక వ్యాపారాన్ని వైకాపా ‘ముఖ్య నేతలు’ ఒక ఎమ్మెల్యేకి అనధికారికంగా అప్పగించిన తర్వాత కూడా రాజధానిలో ఆ ప్రజాప్రతినిధి అక్రమ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. రాత్రి పూట కృష్ణా నదిలో ఇసుక తవ్వి, ఆయన బంధువులకే చెందిన రెండు పడవల్లో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చుట్టుపక్కల నిల్వ చేస్తున్నారు.. అక్కడి నుంచి తుళ్లూరు స్టేషన్ మీదుగా యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి