అమరావతి ఉద్యమానికి 1,200 రోజులు

ఒకటా.. రెండా.. ఏకంగా 1,200 రోజులు. రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వంపై రాజధాని గ్రామాల ప్రజలు, భూములిచ్చిన రైతులు ఉద్యమ బావుటా ఎగరవేసి శుక్రవారానికి పన్నెండు వందల రోజులవుతోంది. ప్రభుత్వ దమననీతిని, పోలీసుల దాడులు, నిర్బంధాలు, ఆంక్షలు, అక్రమ కేసులను తట్టుకుని సామాన్య రైతులు, ప్రజలు ఇన్ని రోజులపాటు ఉద్యమ ప్రస్థానం కొనసాగించడం అసాధారణం.

Published : 31 Mar 2023 05:14 IST

ఎత్తిన పిడికిలి దించని రాజధాని రైతులు
ప్రభుత్వ దాష్టీకాలపై అలుపెరగని పోరు
నేడు ప్రత్యేక కార్యక్రమాలు

ఈనాడు, అమరావతి: ఒకటా.. రెండా.. ఏకంగా 1,200 రోజులు. రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వంపై రాజధాని గ్రామాల ప్రజలు, భూములిచ్చిన రైతులు ఉద్యమ బావుటా ఎగరవేసి శుక్రవారానికి పన్నెండు వందల రోజులవుతోంది. ప్రభుత్వ దమననీతిని, పోలీసుల దాడులు, నిర్బంధాలు, ఆంక్షలు, అక్రమ కేసులను తట్టుకుని సామాన్య రైతులు, ప్రజలు ఇన్ని రోజులపాటు ఉద్యమ ప్రస్థానం కొనసాగించడం అసాధారణం. 2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి జగన్‌ శాసనసభలో మూడు రాజధానుల ప్రస్తావన తేవడంతో.. మర్నాటి నుంచి రాజధాని గ్రామాల్లో ఎగసిన ఉద్యమం.. కొనసాగుతూనే ఉంది. వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ వంటి న్యాయకోవిదులు, పలువురు విశ్రాంత ఐఏఎస్‌లు, మేధావులు, ఎన్‌ఆర్‌ఐలు ఉద్యమానికి బాసటగా నిలిచారు.

ప్రభుత్వ ఆంక్షలకు ఎదురొడ్డి..

అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లోకి దింపింది. 144 సెక్షన్‌, పోలీసు చట్టంలోని సెక్షన్‌ 30 వంటివి ప్రయోగించి, గ్రామాల్ని అష్టదిగ్బంధం చేసింది. ఇళ్లల్లోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీలు చేశారు. 2020 జనవరిలో విజయవాడ కనక దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతున్న మహిళల్ని అడ్డుకుని లాఠీఛార్జి చేశారు. మర్నాడు మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఒక గర్భిణిని పోలీసు అధికారి ఒకరు కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకుని మందలించడంతో గ్రామాలపై పోలీసుల ఉక్కు పిడికిలిని కొంత సడలించారు. 2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు.. శాసనసభ సమీపానికి చేరుకోవడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. 2021 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున విజయవాడ కనకదుర్గ గుడికి వెళుతున్న మహిళలపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. రాజధాని ఉద్యమంలో పాల్గొంటున్నవారిపై పోలీసులు కొన్ని వందల కేసులు నమోదు చేశారు.  

పాదయాత్రపైనా దాష్టీకం..

రాజధాని రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు 2021 నవంబరు 1న పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి విశేషమైన స్పందన, మద్దతు లభించింది. పోలీసులు మాత్రం పాదయాత్ర అమరావతిలో మొదలై తిరుపతి చేరేంత వరకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రైతులకు ఆశ్రయమిచ్చినవారినీ వేధించారు. రాత్రి బస కోసం రైతులు ముందే కల్యాణ మండపాలు వంటివి బుక్‌ చేసుకుంటే... స్థానిక వైకాపా నాయకులు అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి. అమరావతి పరిరక్షణ ఉద్యమం వెయ్యో రోజుకు చేరిన సందర్భంగా.. 2022 సెప్టెంబరు 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి దారి పొడవునా వైకాపా నాయకులే వారికి అడ్డుతగిలారు. రాజధాని రైతులు తమ ప్రాంతానికి ఎలా వస్తారో చూస్తామంటూ.. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైకాపా నాయకులూ బెదిరింపులకూ దిగారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రామచంద్రపురం దగ్గరకు వెళ్లేసరికి.. రైతులు పాదయాత్ర నిలిపివేయాల్సి వచ్చింది.

కోర్టు చెప్పినా.. విశాఖ పాటే..!

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత ఏడాది మార్చి మొదటివారంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. అమరావతి నిర్మాణానికి, రాజధాని రైతులుకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు, రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల కల్పనకు నిర్దిష్టమైన గడువులూ విధించింది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. ఆ కేసు ఇంకా విచారణలో ఉండగానే.. ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే రాజధానిని విశాఖకు మారుస్తామని చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా అమరావతిలో స్థలాలు ఇచ్చేందుకు 900కు పైగా ఎకరాలతో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా మార్పులు చేసింది. దాని కోసం సీఆర్‌డీఏ చట్టాన్నీ సవరించింది. చట్ట సవరణను సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు కోర్టులో విచారణలో ఉండగానే, ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేసింది.


నేడు ప్రత్యేక కార్యక్రమాలు

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ‘దగా పడ్డ రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు’ అనే పేరుతో శుక్రవారం మందడం శిబిరంలో అమరావతి ఐకాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉద్యమకారులతో ప్రత్యేక సదస్సు నిర్వహించడానికి ఐకాస శ్రీకారం చుట్టింది. వివిధ పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఐకాస నాయకులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు