నయన మనోహరం.. జగదభిరాముని కల్యాణం

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది.

Updated : 31 Mar 2023 05:55 IST

శ్రీరామ నామస్మరణతో మార్మోగిన భద్రాచలం
రామతీర్థంలో ఘనంగా నవమి వేడుకలు
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఈటీవీ-ఖమ్మం, న్యూస్‌టుడే -భద్రాచలం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. మూడుముళ్ల బంధంతో సీతారాములు ఒక్కటైన మధురక్షణాలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మిథిలా మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేదమంత్రాలు మార్మోగుతుండగా అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర- బెల్లాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. మాంగల్యధారణ అట్టహాసంగా సాగింది. ఎక్కడైనా రెండు సూత్రాలుంటాయి. ఇక్కడ మాత్రం పుట్టింటి వారి తరఫున ఒకటి, మెట్టింటి వారి తరఫున ఒకటి.. భక్తరామదాసు తరఫున మరో సూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగల్యధారణ నిర్వహించటం విశేషమని స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు ప్రవచించారు.  శ్రీరాముడు అవతరించిన శ్రీరామనవమి రోజే కల్యాణం నిర్వహించే సంప్రదాయాన్ని భక్తరామదాసు ప్రవేశపెట్టగా.. తూము లక్ష్మీనరసింహదాసు కొనసాగించారని త్రిదండి చినజీయర్‌ స్వామి  పేర్కొన్నారు. ఇది శోభకృత్‌ నామ సంవత్సరమని.. సీతమ్మ వారు అవతరించింది ఈ ఏడాదేనని, ఇలాంటి సంవత్సరంలో వీక్షించే కల్యాణం ఎంతో గొప్పదని విశ్లేషించారు. శ్రీ భద్రాచల రామదాసు పీఠం తరఫున రూపొందించిన సంక్షేప రామాయణం సీడీని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి జీయర్‌స్వామి ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, తితిదే మాజీ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.


రామతీర్థంలో వైభవంగా వేడుకలు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం ఘనంగా సీతారాముల కల్యాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడి ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. రామతీర్థాన్ని మరో భద్రాచలంగా చెప్పుకోవచ్చన్నారు. అక్కడి సంప్రదాయం మాదిరిగానే ఇక్కడా కల్యాణ మహోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.


ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.


తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీవేంకటాద్రిరాముని అవతారంలో శ్రీవారు కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని పండితులు నిర్వహించారు.


ఆంజనేయస్వామికి 30 వేల వడలతో అలంకరణ

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలోని శ్రీభక్తాంజనేయస్వామిని శ్రీరామనవమి సందర్భంగా 30 వేల మినప వడలతో అలంకరించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేసి వడలను ప్రసాదంగా అందించారు.

న్యూస్‌టుడే, చంద్రగిరి


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు