లాం.. సలాం

స్వాతంత్య్రానికి పూర్వమే వ్యవసాయ పరిశోధన కోసం ఏర్పాటైన తొలి సంస్థ లాంఫామ్‌. వర్షాధార ప్రాంతాల్లో అత్తెసరు దిగుబడులతో నెట్టుకొస్తున్న అన్నదాతలకు ఆసరాగా నిలిచింది.

Published : 31 Mar 2023 02:51 IST

వందేళ్లుగా రైతుల సేవలో పరిశోధన కేంద్రం

ఈనాడు, అమరావతి: స్వాతంత్య్రానికి పూర్వమే వ్యవసాయ పరిశోధన కోసం ఏర్పాటైన తొలి సంస్థ లాంఫామ్‌. వర్షాధార ప్రాంతాల్లో అత్తెసరు దిగుబడులతో నెట్టుకొస్తున్న అన్నదాతలకు ఆసరాగా నిలిచింది. చిరుధాన్యాల దిగుబడుల పెంపు ప్రయోగాలతో మొదలై పశు పరిశోధన, ఆహార, వాణిజ్య పంటల పరిశోధనలకు చుక్కానిలా నిలిచింది. మెరుగైన వ్యవసాయ విధానాలు, కొత్తరకం వంగడాల ఆవిష్కరణలకు జాతీయస్థాయిలో వేదికగా మారింది. బ్రిటిష్‌ వారి కాలంలో ఏర్పాటై.. నేటికీ సాగుఫలాలకు ఊతమిస్తున్న గుంటూరు లాంఫామ్‌ ప్రాంతీయ పరిశోధన కేంద్రం వంద వసంతాలు పూర్తిచేసుకుంది. నేడు శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

గుంటూరు-అమరావతి ప్రధానమార్గంలో లాంఫామ్‌ ఉంది. 2వేల ఏళ్ల క్రితం బౌద్ధ భిక్షువులు నివసించిన ప్రాంతం కావడంతో ఈ గ్రామానికి లాం అనే పేరు వచ్చింది. పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో వాడుకలో లాంఫామ్‌గా స్థిరపడింది. 1922లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం పేరిట 300 ఎకరాల విస్తీర్ణంలో బ్రిటిష్‌ పాలకులు దీన్ని ఏర్పాటుచేశారు. మొదట్లో మెట్ట పంటలకు ఈ కేంద్రం ఆసరాగా నిలిచింది. నాటి నుంచి స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు, పశుపోషణ ప్రయోగాలకు కేంద్రమైంది. 1964-65లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తయి సాగునీరు అందుబాటులోకి వచ్చాక పంటల సరళి మారింది. దీంతో చిరుధాన్యాల నుంచి పొగాకు, అపరాలు, మిరప, పత్తి తదితర పంటలపై ఇక్కడ పరిశోధనలు జరిగాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతుల వ్యవసాయ అవసరాలకు అనువైన పరిశోధనలు జరిగాయి. ఒంగోలు జాతి పశువుల పరిరక్షణ, అభివృద్ధిపైనా ఈ కేంద్రం పనిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాక లాంఫామ్‌ను దాని పరిధిలోకి తెచ్చారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విభజన అనంతరం లాంఫామ్‌ పరిశోధన కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు.

నూతన వంగడాలకు ప్రాణప్రతిష్ఠ

లాంఫామ్‌లో వందేళ్లలో జరిగిన పరిశోధనలు ఎన్నో కొత్త వంగడాలకు పురుడు పోశాయి. వరిలో జాతీయస్థాయిలో పేరుగాంచిన సాంబమసూరి, స్వర్ణ రకాలు ఇక్కడివే. దేశంలో మూడోవంతు సాగయ్యే వరి రకాలు మనవేనని శాస్త్రవేత్తలు ఘనంగా చెబుతున్నారు. మిరపలో గుంటూరు సన్నాలు, 334 పేరుతో వచ్చిన వంగడాలు రైతుల ఆదరణ పొందాయి. పత్తిలో దేశీ కాటన్‌, ఎంసీయూ-5, కందిలో ఎల్‌ఆర్‌జీ-30, 41, 52 రకాలు, మినుములో ఎల్‌బీజీ-17, 752, పెసరలో ఎల్‌జీజీ-460 బాగా సాగులోకి వచ్చాయి. పత్తిలో కాండానికి మందు పూత ప్రయోగం ఇక్కడే జరిగింది. వరిలో వెదపద్ధతి విధానాన్ని ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టి ఫలితాలు సాధించి విస్తృతం చేశారు. వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను రెండోపంటగా సాగులోకి తీసుకొచ్చిన పరిజ్ఞానం ఇక్కడ విజయవంతమై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకూ విస్తరించింది. వివిధ పంటల్లో 76 రకాల విత్తనాలను ఈ పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేశారు. తాజాగా కిసాన్‌ డ్రోన్‌ శిక్షణకు డీజీసీఏ నుంచి అనుమతి పొందిన ఏకైక కేంద్రంగా లాం గుర్తింపు పొందింది. డిజిటల్‌ వ్యవసాయ కార్యకలాపాలూ ఇక్కడ ప్రారంభమయ్యాయి.

రైతులకు వరం

వర్షాధార ప్రాంతాలుగా ఉన్న గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వ్యవసాయ ముఖచిత్రం మారడానికి లాం పరిశోధన స్థానం ఎంతగానో దోహదపడింది. కేవలం వర్షాలపై ఆధారపడి జొన్న, సజ్జ, రాగుల్లాంటి చిరుధాన్యాలను పండిస్తున్న పరిస్థితి నుంచి వరి, అపరాల వంటి ఆహార పంటలు, మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలు సాగుచేసే స్థాయికి రైతులు ఎదిగారు. ఇక్కడి పరిశోధనల కారణంగా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయంలో బలమైన పునాదులు వేయడంలో లాంఫామ్‌ తనదైన ముద్ర వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని