పెరుగుతున్న ఎండలు.. అక్కడక్కడా జల్లులు

ఒక వైపు మండే ఎండలు.. మరోవైపు తేలికపాటి జల్లులు.. భిన్న వాతావరణ పరిస్థితులు అటు రైతుల్ని, ఇటు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి.

Published : 31 Mar 2023 02:51 IST

41 డిగ్రీలకు చేరువైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షపాతం

ఈనాడు, అమరావతి: ఒక వైపు మండే ఎండలు.. మరోవైపు తేలికపాటి జల్లులు.. భిన్న వాతావరణ పరిస్థితులు అటు రైతుల్ని, ఇటు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత  మొదలవుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. మార్చి 18 నుంచి మొదలైన అకాల వర్షాలు.. ఇంకా అక్కడక్కడ ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో కొన్నిచోట్ల 2 సెం.మీ పైనే వర్షపాతం నమోదువుతోంది. శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. ఉత్తర మధ్య మహారాష్ట్రలోని మధ్యభాగాల నుంచి ఉన్న ద్రోణి.. విదర్భ, మరఠ్వాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు పేర్కొంది. రాయలసీమలో  ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

* రాయలసీమతోపాటు ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంది. గురువారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైయస్‌ఆర్‌ జిల్లా చక్రాయపేట, కర్నూలు జిల్లా పూడూరుల్లో 40.7, నంద్యాల జిల్లా మిడ్తూరులో 40.5, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో 40.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

* గురువారం అన్నమయ్య, చిత్తూరు, విశాఖపట్నం, నంద్యాల, ప్రకాశం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో.. బుధవారం శ్రీకాకుళం, అనకాపల్లి, నంద్యాల, శ్రీసత్యసాయి, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని