ఈఎస్‌ఐ వైద్యం ఇష్టారాజ్యం
ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రాష్ట్రంలో ఈఎస్‌ఐ వైద్యం ఇష్టారాజ్యంగా మారింది. మందుల కొనుగోలు నుంచి ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపుల వరకు ప్రతిచోటా నిర్లక్ష్యమే.
కేంద్ర నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడంలోనూ నిర్లక్ష్యమే
మెడికల్ బిల్లుల కోసం ఉద్యోగుల కాళ్లు అరగాల్సిందే
బిల్లుల పెండింగ్‌తో మందుల సరఫరాకు కంపెనీల వెనుకంజ
ఈనాడు, అమరావతి: ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రాష్ట్రంలో ఈఎస్‌ఐ వైద్యం ఇష్టారాజ్యంగా మారింది. మందుల కొనుగోలు నుంచి ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపుల వరకు ప్రతిచోటా నిర్లక్ష్యమే. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలోనే కాదు.. వాటిని సకాలంలో ఖర్చు చేయడంలోనూ విఫలమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా సుమారు రూ.385 కోట్లకు పైగా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో రూ.400 కోట్ల వరకు నిధులు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న నిధులు రూ.240 కోట్లు దాటడం లేదు. కేంద్రం విడతల వారీగా ఇస్తున్న నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడం, వాటిని ఇతర అవసరాలకు వాడేస్తున్నందున మిగతా నిధులు విడుదల కావడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.233 కోట్లు విడుదల చేయగా.. ఇందులో వైద్యులు, సిబ్బంది జీతాల కోసం రూ.100 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గతేడాది మే, జూన్ నెలల్లో నిధులు రావడంతో ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. కార్మిక శాఖ మాత్రం గత జనవరిలో పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఫిబ్రవరి వరకు సీఎఫ్‌ఎంఎస్‌లో రూ.53 కోట్ల బిల్లులను మాత్రమే అప్‌లోడ్ చేయగా.. మార్చి నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ను నిలిపివేశారు. ఈ ఏడాదికి ఆ బిల్లులు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీతాలకు కాకుండా మందులు, ఇతరత్రా ఖర్చు చేసింది కేవలం రూ.53 కోట్లే.
మందులూ కొరతే..
రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు 14 లక్షల మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.2,750 చొప్పున రాష్ట్రానికి కేంద్రం నిధులిస్తోంది. దీనికి ఒక శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి ఈఎస్‌ఐ సేవలందించాలి. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా కార్మికులకు సరైన వైద్యం అందడం లేదు. మందుల సరఫరా కంపెనీలకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. దీంతో కొన్ని కంపెనీలకు ఇండెంట్ పెట్టినా సరిగా మందులివ్వడం లేదని, ఒక్కోసారి సగమే ఇస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మందుల కొరత వేధిస్తోంది. నొప్పి నివారణ మాత్రలు, ఎసిడిటీ నివారణ మందులు, గుండె సంబంధ వ్యాధులకు వాడే ఔషధాలు రోగులకు సరిపడా ఉండటం లేదు. కొన్నిచోట్ల మధుమేహం, రక్తపోటు మందులూ పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కిట్ల కొరతతో కొన్ని డిస్పెన్సరీల్లో మధుమేహ రక్త పరీక్షలు చేయడం లేదు. వీటి కోసం ఆస్పత్రులకు వెళ్లాలని సిఫార్సు చేస్తుండటంతో రోగులకు అదనపు ప్రయాస తప్పడం లేదు. డయాగ్నస్టిక్ కేంద్రాల్లో హర్మోన్ల పరీక్షల తప్ప మిగిలిన అన్ని పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆదోని, తిరుపతి సూళ్లూరుపేట వంటి చోట్ల ఎక్స్‌రేలు తీయడం లేదు.
బిల్లుల కోసం కాళ్లు అరగాల్సిందే..
ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే చిరుద్యోగులు అత్యవసర వేళ అప్పో సప్పో చేసి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. వారు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే.. బిల్లులు ప్రభుత్వానికి పంపించామని, వస్తే ఇస్తామంటున్నారే తప్ప ఎప్పటిలోపు చెల్లించేది చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి బిల్లులు సుమారు రూ.7 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి