Seediri Appalaraju: మంత్రి అప్పలరాజుకు సీఎంఓ పిలుపు

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి పిలుపు అందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నుంచి హడావుడిగా బయల్దేరి శుక్రవారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు.

Updated : 01 Apr 2023 08:57 IST

ఒకేరోజు రెండుసార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన మంత్రి
కేబినెట్‌లో ఉన్నా లేకపోయినా నేను మంత్రినే
మార్పుల గురించి నాకు సమాచారం లేదు: అప్పలరాజు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి పిలుపు అందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నుంచి హడావుడిగా బయల్దేరి శుక్రవారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం మరోసారి సీఎంఓకు వెళ్లివచ్చారు. ఆయన వెంట పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ కూడా వెళ్లినట్లు తెలిసింది. పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్‌ అచ్చెన్న హత్యపై చర్చించేందుకు తాను సీఎంఓకు వెళ్లినట్లు మంత్రి అప్పలరాజు చెప్పారు. దళిత అధికారి అయిన అచ్చెన్న హత్య, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై ఆ శాఖ ఉద్యోగులు, దళిత ఉద్యోగసంఘాల ప్రతినిధులు, ఎమ్మార్పీఎస్‌, కులవివక్ష వ్యతిరేక పోరాటసమితి వంటి సంస్థలు, అఖిలపక్షాలు ఆందోళనలకు దిగాయి. ఈ కేసులో అసలు దోషి పశుసంవర్ధక శాఖలో ఉన్నతాధికారి అని, ఆయన్ను సస్పెండ్‌ చేసి అరెస్టు చేయాలంటూ అ శాఖ డైరెక్టరేట్‌ను ఉద్యోగులు శుక్రవారం ముట్టడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇరుకున పడింది. అందువల్లే ఈ కేసుపై సీఎంఓ జోక్యం చేసుకుని మంత్రిని పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. అచ్చెన్న హత్యకు దారితీసిన అంశాలేంటి? శాఖాపరంగా ఉద్యోగుల అభిప్రాయం ఏంటి? మంత్రిగా ఆయన దృష్టికి వచ్చిన ఇలాంటి విషయాలు ఇంకేమైనా ఉన్నాయా... వంటి పలు అంశాలపై అప్పలరాజు నుంచి సీఎంఓ అధికారులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఒక ఉన్నతాధికారి చుట్టూ కేసు ఎందుకు తిరుగుతోందనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

మంత్రివర్గంలో మార్పుల చేర్పుల నేపథ్యంలోనే: మంత్రి అప్పలరాజును హడావుడిగా సీఎంఓకు పిలిపించడంతో.. మంత్రిమండలిలో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగింది. మరోవైపు శాసనసభాపతి తమ్మినేని సీతారాం సైతం సీఎం జగన్‌ను శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. దీంతో అప్పలరాజు బయటకు, సీతారాం మంత్రిమండలిలోకి అని కూడా ప్రచారం జరిగింది.

జగన్‌ దృష్టిలో అందరూ మంత్రులే

‘మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా నేను మంత్రినే. ఎందుకంటే మాకున్న 151మంది ఎమ్మెల్యేలు, మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యులంతా సీఎం జగన్‌ దృష్టిలో మంత్రులే’ అని మంత్రి అప్పలరాజు అన్నారు. విజయవాడలో ఆయన్ను మీడియా ప్రతినిధులు కలిసి అడగ్గా మంత్రి స్పందిస్తూ.. ‘నన్నేదో సీఎంఓ పిలిపించింది, మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారంటూ టీవీల్లోనే చూశాను. సీఎం నన్ను మంత్రిపదవి నుంచి మార్చినా నాకేమీ ఇబ్బంది లేదు. పదవి లేకపోయినా నేనేమీ బాధపడను. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఏదైనా మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం నాలుగు కాలాలు ఉండాలని నమ్మేవాడిని. జగన్‌ నాలుగైదుసార్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని స్థాపించగలమని నమ్మే వ్యక్తిని నేను’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని