ఇసుక వ్యాపారం పారదర్శకమేనట!

‘డిపాజిట్‌ సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురై కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు ఎందుకు చెబుతున్నారు?

Published : 01 Apr 2023 05:22 IST

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే దుష్ప్రచారమట
‘ఈనాడు’ కథనంపై వివరణ ఇచ్చేందుకు గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఆపసోపాలు
కళ్ల ముందే ఇసుక దోపిడీ కనిపిస్తున్నా కప్పిపుచ్చే యత్నం

ఈనాడు - అమరావతి: ‘డిపాజిట్‌ సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురై కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు ఎందుకు చెబుతున్నారు?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో జేపీ సంస్థకు వ్యతిరేకంగా ఎన్జీటీలో తనతో కేసు వేయించిన అధికార పార్టీ ఎమ్మెల్యేయే, ఇప్పుడు ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ అమరావతి మండలం ధరణికోటకు చెందిన నాగేంద్రకుమార్‌ చేసిన బహిరంగ ఆరోపణలపై గనులశాఖ ఎందుకు స్పందించలేదు?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక వ్యాపారం విషయంలో అధికార పార్టీ నేతల్లో రచ్చ జరిగింది వాస్తవం కాదా?

జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల నుంచి నిత్యం ఇసుక లారీలు హైదరాబాద్‌కు పరుగులు పెడుతుండటం అబద్ధమా?

రీచ్‌ల్లో ముద్రిత బిల్లులు ఇస్తూ, కేవలం నగదు మాత్రమే తీసుకోవడంలో ఆంతర్యమేంటి? ఆ సొమ్ము ఎక్కడికి చేరుతోందో అధికారులకు తెలియదా?’..

కానీ ఇవేమీ నిజాలు కాదన్నట్లు గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి వితండవాదన వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారంలో దోపిడీని కళ్లకు కట్టినట్లు ‘ఈనాడు’లో ప్రచురించారని ఇసుక వ్యాపారులు, రవాణాదారులు చెబుతుంటే.. గనులశాఖ సంచాలకులు మాత్రం అసత్యాలు రాశారని, ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీ అమలు చేస్తోందంటూ పాతపాటే వినిపించారు. ‘దాచుకో.. పంచుకో.. తినుకో’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.

వాస్తవాలను వక్రీకరించారు: సంచాలకులు

‘వాస్తవాలు వక్రీకరించారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంతో ప్రజలను దోచుకుంది. సీఎం జగన్‌ కొత్త ఇసుక విధానం తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా టెండర్లు నిర్వహించి, ఎంపిక చేసిన జేపీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ సంస్థ ఎంత ఇసుక తవ్విందో, విక్రయించిందో గనులశాఖకు నివేదిస్తుంది. రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక వెళ్లకుండా గనులశాఖ ప్రాంతీయ స్క్వాడ్‌, సెబ్‌ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇంత పకడ్బందీగా ఇసుక విధానం ఉంటే, ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతోనే కథనాలు రాస్తున్నారు. అధికార పార్టీ నేతలు సిండికేట్లుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఎలా ఆరోపిస్తారు? ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలతో రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుంటే.. రూ.1,800 కోట్లు ఆదాయం వస్తుందని ఎలా చెబుతారు? జిల్లాల వారీగా రేట్లు ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారని, వారికి లక్ష్యాలు విధించి ముఖ్యనేతలు రూ.కోట్లలో వసూలు చేస్తున్నారనేదానికి అర్థం ఉందా?’ అని వెంకటరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవన్నీ నిజాలు కదా?

* ప్రతి జిల్లాలో అధికార పార్టీ నేతలు, ఇసుక వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్నది అబద్ధమా? అలాగైతే ఈ కథనం తప్పని, మా పర్యవేక్షణలో ఉప గుత్తేదారు టర్న్‌కీ ద్వారా మాత్రమే ఇసుక వ్యాపారం కొనసాగుతోందని ప్రధాన గుత్తేదారైన జేపీ సంస్థ ఎందుకు చెప్పలేదు? ఇసుకపై కథనం ప్రచురించిన ప్రతిసారి దాన్ని ఖండిస్తూ గనులశాఖ సంచాలకులు ప్రకటన జారీ చేయడమే తప్ప, జేపీ సంస్థ ఎందుకు స్పందించదు?  

* కొవ్వూరుకు చెందిన ప్రేమ్‌రాజ్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక వ్యాపారం కోసం రూ.25 కోట్లు డిపాజిట్‌ చేశారని, నెలకు రూ.21 కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉండగా నష్టపోయారని, ఆయనకు చెందిన రూ.16 కోట్లు ఇవ్వకుండా ఆపేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు, సన్నిహితులు చెప్పింది వాస్తవం కాదా? మార్చి 20న దీనిపై పత్రికల్లో వచ్చినా సమగ్ర విచారణకు ఎందుకు ఆదేశించలేదు?

* ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం భారీగా సాగుతోందంటూ, గతంలో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి చెబుతుంటే.. అది అభూత కల్పన ఎలా అవుతుంది? ఆ ఆరోపణలు తప్పంటూ అక్కడి గనుల శాఖ అధికారులు, జేపీ సంస్థ ఎందుకు స్పందించలేదు?  

* ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొన్నటి వరకు ఇసుక వ్యాపారం నిర్వహించిన ఓ ప్రజాప్రతినిధిని, ఆయన తండ్రిని నందిగామ మండల వైకాపా అధ్యక్షుడు ఇసుక తవ్వకాల్లో గొడవ కారణంగా దుర్భాషలాడిన వీడియో బయటకు రాలేదా? ఆయనతో పార్టీ పదవికి రాజీనామా చేయిస్తే.. మళ్లీ ఆ పార్టీ నియోజకవర్గ నేతలతోనే కలిసి తిరుగుతుండటం వాస్తవం కాదా?

* ఉమ్మడి కడప జిల్లాలో ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సోదరుడు, అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాలో కొందరు.. ఇలా ప్రతి జిల్లాలో సిండికేట్లుగా ఏర్పడి ప్రతి నెలా రీచ్‌ల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తూ ఇసుక వ్యాపారం చేయడం నిజం కాదా?

ఆన్‌లైన్‌ బిల్లులపై డైరెక్టర్‌ స్పందించరే?

రాష్ట్రంలో ఇసుక దందాపై ‘ఈనాడు’లో కథనం వచ్చిన ప్రతిసారి గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించి, వివరణ ఇస్తుంటారు. మంత్రి తరహాలో అనేక అంశాలను ప్రస్తావిస్తుంటారు. కానీ ఇసుక విక్రయాలకు ఆన్‌లైన్‌ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు? డిజిటల్‌ చెల్లింపులు స్వీకరించకుండా నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారో మాత్రం చెప్పరు.

* జేపీ సంస్థ 2021 మే 14 నుంచి ఇసుక వ్యాపారం చేపట్టింది. దానిపేరిట టర్న్‌కీ ఉపగుత్తేదారుగా విక్రయాలు చేస్తోంది. మరో నెలన్నరలో జేపీ సంస్థతో చేసుకున్న రెండేళ్ల ఒప్పందం పూర్తికానుంది. అయినా ఇంతకాలం జేపీ సంస్థ ఆన్‌లైన్‌ వేబిల్లులు జారీ చేయకుండా, ముద్రిత బిల్లులే ఎందుకిస్తోంది? పారదర్శకంగా ఆన్‌లైన్‌ బిల్లులు ఇవ్వడానికి గనులశాఖ సాఫ్ట్‌వేర్‌ రూపొందించినా దాన్ని ఎందుకు పక్కనపెట్టారో వెంకటరెడ్డి ఏనాడూ చెప్పరు.

* నిత్యం రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? ఆన్‌లైన్‌, డిజిటల్‌ చెల్లింపులను రీచ్‌ల్లో ఎందుకు తీసుకోవడం లేదో? సంచాలకులు ఏనాడూ వివరణ ఇవ్వరు.

* రీచ్‌లు వారీగా వసూలైన సొమ్మును.. జిల్లా స్థాయిలో సిండికేట్లకు, అక్కడి నుంచి రాష్ట్రస్థాయిలో ముఖ్యులకు చేర్చేందుకే కేవలం నగదు తీసుకుంటారనే ఆరోపణ వాస్తవం కాదా? అలాగైతే ఆన్‌లైన్‌ చెల్లింపులు స్వీకరించవచ్చు కదా?

మధ్యలో రెండు సంస్థలు ఎందుకొచ్చాయి?

నిరుడు ఆగస్టులో ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్‌కీని హఠాత్తుగా పంపేశాక బ్రాక్స్‌టన్‌ ఇన్‌ఫ్రా, కేకేఆర్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థలను రెండు నెలల వ్యవధిలో ఉపగుత్తేదారులుగా చూపలేదా? టర్న్‌కీ తర్వాత ఇతర సంస్థలను ఉపగుత్తేదారులుగా నియమించుకోలేదని జేపీ సంస్థ గనులశాఖకు లేఖలు ఎందుకు రాసిందో సంచాలకులే చెప్పాలి. రెండు నెలల తర్వాత టర్న్‌కీ మళ్లీ ఎందుకు వచ్చిందో ఆ సంస్థతో అయినా వివరణ ఇప్పించగలరా?

సంచాలకులు రీచ్‌కి వెళితే నిజాలు తెలుస్తాయి

ఇసుక కథనాలపై ఇంతలా స్పందించే గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఆకస్మికంగా వెళ్లి ఏదైనా రీచ్‌లో పరిశీలిస్తే.. అక్కడ టర్న్‌కీ బదులు, అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక వ్యాపారమంతా కళ్లకు కడుతుంది. కానీ ఆయన ఎప్పుడూ రీచ్‌ల్లో తనిఖీలు చేసిన దాఖాలాలే లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని