దేవుడా.. నీ ఆస్తులకు దిక్కెవరు?
దేవుడి ఆస్తుల్ని దొరికితే దోచేస్తున్నారు తప్ప, కాపాడేవారు కరవయ్యారంటూ హైకోర్టు వ్యాఖ్యలు.. దేవాదాయశాఖలో అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. దేవుడి భూముల్ని రక్షించకుండా పరాయిపరం చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న అధికారులు ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు.
ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యేలా అధికారుల నిర్ణయాలు
ఎడాపెడా నిధుల దుర్వినియోగం
గుత్తేదారులకు మేలు కలిగేలా ఆదేశాలు
హైకోర్టు వ్యాఖ్యలతో చర్చనీయాంశమైన దేవాదాయ కమిషనర్ తీరు
ఈనాడు - అమరావతి
దేవుడి ఆస్తుల్ని దొరికితే దోచేస్తున్నారు తప్ప, కాపాడేవారు కరవయ్యారంటూ హైకోర్టు వ్యాఖ్యలు.. దేవాదాయశాఖలో అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. దేవుడి భూముల్ని రక్షించకుండా పరాయిపరం చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న అధికారులు ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా.. కోర్టులు పదేపదే మొట్టికాయలు వేసినా.. తమ ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. పాత గుంటూరులోని కంచి కామాక్షి ఏకాంబరేశ్వరస్వామి ఆలయ ఆస్తుల జాబితాలో నమోదైన భూమిని నిషేధిత జాబితా (22ఏ) నుంచి తొలగిస్తూ దేవాదాయ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఉత్తర్వు జారీ చేయడంపై హైకోర్టు తాజాగా తీవ్రస్థాయిలో మండిపడింది. కమిషనర్‌గా ఉండేందుకు ఆయన అర్హుడు కాదని తేల్చిచెప్పింది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దేవుడి భూముల్ని ధారాదత్తం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో కమిషనర్ పనితీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆలయాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు దేవాదాయశాఖ తలొగ్గుతోందనే విమర్శలూ కొంతకాలంగా ఎక్కువయ్యాయి.
రూ.30 కోట్ల స్థలం వదులుకునేలా..
కాకినాడలోని పెద్ద మార్కెట్‌లో నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి చెందిన అర ఎకరం స్థలాన్ని 2002లో బహిరంగ వేలం వేయగా, ఓ మాజీ ఎమ్మెల్యేకి చెందిన ప్రముఖ విద్యాసంస్థ రూ.34.75 లక్షలకు పాడుకుంది. 15 రోజుల్లో ఆ సొమ్ము చెల్లించి, 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 9 నెలలకు అదీ మూడు వాయిదాల్లో కట్టారు. స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. నిబంధనల ప్రకారం దేవాదాయశాఖ ఇచ్చిన గడువులోపు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే, వేలం సొమ్ముతోపాటు ఆ స్థలమూ ఆలయానికే చెందుతుంది. అయితే ఆ విద్యాసంస్థ అధిపతి 2015 నుంచి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించినా కమిషనర్లు సమ్మతించలేదు. ఇప్పుడు ఆ స్థలం విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో కేవలం రూ.లక్ష అపరాధ రుసుము తీసుకొని ఆ విద్యాసంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేసేలా గత అక్టోబరులో దస్త్రాన్ని కదిపారు. ఈ విషయం అప్పట్లో ‘ఈనాడు’లో ప్రచురితమవడంతో ఉత్తర్వులిచ్చే ముందు వెనక్కి తగ్గారు. ఈ అంశం బయటకు రావడానికి కారకుడని భావించి కమిషనరేట్‌లోని ఓ సీనియర్ అసిస్టెంట్‌ను భూముల విభాగం నుంచి తప్పించారు. చివరకు ఆయనకు ఇష్టం లేకపోయినా దేవాదాయ ట్రైబ్యునల్‌కు బదిలీ చేశారు. అయిదు నెలలుగా ఆయనకు జీతం రానివ్వకుండా వేధిస్తున్నారు.
విద్యా సంస్థలతోపాటు రూ.కోట్ల ఆస్తులు సైతం..
ఎయిడెడ్ విద్యా సంస్థలను విద్యాశాఖకు అప్పగించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ పరిధిలోని కొన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలతోపాటు, వాటి ఆస్తులను కూడా అప్పగించేలా దేవాదాయ కమిషనర్ ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది. రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన హితకారిణి సమాజానికి చెందిన ఎయిడెడ్ కళాశాలలతోపాటు, రూ.200 కోట్లు విలువైన వాటి ఆస్తులను కూడా అప్పగించేలా తొలుత ఉత్తర్వులిచ్చారు. దీనిపై కలకలం రేగడంతో, కేవలం విద్యా సంస్థలను మాత్రమే ఇచ్చేలా సవరించి మరో ఉత్తర్వు జారీ చేశారు.
* విజయవాడ శివారు గొల్లపూడిలోని పోసాని నర్సింహరావుచౌదరి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ప్రాంగణమున్న 2.74 ఎకరాలతోపాటు, దీనికి చెందిన రూ.35 కోట్ల విలువైన 7.02 ఎకరాల పొలాన్ని కూడా విద్యాశాఖకు అప్పగించారు.
* విజయనగరం జిల్లాలో మొన్నటి వరకు పనిచేసిన దేవాదాయశాఖ అధికారి.. విజయనగరంలోని మంచుకొండవారి సత్రానికి చెందిన స్థలం, భోగాపురం మండలంలోని కొమ్మూరు అప్పడుదొర ట్రస్ట్‌కు చెందిన 3.84 ఎకరాలు, నీలాయమ్మ సత్రానికి చెందిన 23.24 ఎకరాలకు ఎన్వోసీ ఇచ్చేందుకు వీలుగా కమిషనర్‌కు నివేదికలు పంపారు. అయినా ఆయనపై కమిషనర్ చర్యలు తీసుకోలేదు. పత్రికల్లో కథనాలు రావడంతో ఎట్టకేలకు ఆ అధికారిని సస్పెండ్ చేశారు.
గుత్తేదారుకు అనుకూలంగా ఆదేశాలు
మంగళగిరిలోని పానకాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2021లో పానకం విక్రయ టెండరును రూ.1.35 కోట్లకు ప్రహ్లాద్ ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. ఆ సంస్థ కేవలం రూ.35 లక్షలే చెల్లించింది. మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు దానిని తప్పించారు. తన సొమ్ము వెనక్కివ్వాలని గుత్తేదారు సంస్థ కోర్టును ఆశ్రయిస్తే.. ఆలయ ఈవోదే తుది నిర్ణయమని తీర్పు వచ్చింది. ఈవో ఆ సొమ్ము ఆలయానికే చెందేలా నిర్ణయం తీసుకున్నారు. గుత్తేదారు సంస్థ ఒత్తిడికి తలొగ్గి ఆ సొమ్ము వెనక్కిచ్చేలా దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఆ ఆదేశాలు ఉపసంహరించి, చివరికి ఈవో నిర్ణయానికే అంగీకారం తెలిపారు.
ఆలయాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు డ్రా చేయించి..
అనేక ఆలయాలు సర్వ శ్రేయోనిధి (సీజీఎఫ్) 9 శాతం, దేవాదాయ పరిపాలన నిధి (ఈఏఎఫ్) 8 శాతం, అర్చక సంక్షేమ నిధి 3 శాతం, ఆడిట్ ఫీజు 1.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఆయా దేవస్థానాలకు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను డ్రా చేసైనా వాటిని చెల్లించాలంటూ నిరుడు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో కొన్ని ఆలయాల అధికారులు అన్నదానం వంటి వాటి కోసం ఎఫ్‌డీ చేసిన మొత్తాన్ని కూడా డ్రా చేయాల్సి వచ్చింది. ఇలా వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయల సీజీఎఫ్ నిధులను దేవాదాయశాఖ అధికారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే వడ్డీని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు.
* సీజీఎఫ్ నిధులను పాత ఆలయాల పునరుద్ధరణకే వినియోగించాలి. కానీ అధికారులకు కొత్త కార్ల కొనుగోళ్లు, కార్యాలయాల నిర్మాణం, మరమ్మతులు, కమిషనరేట్‌లో గోశాల నిర్మాణం, వాస్తు పేరిట నిర్మాణాలకు ఎడాపెడా ఖర్చు చేస్తున్నారు.
* గతేడాది కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు నూతన జిల్లా దేవాదాయ అధికారుల కార్యాలయాలకు, వాటిలో ఫర్నీచర్ కొనుగోళ్లకు వివిధ ఆలయాల సీజీఎఫ్ నుంచి రూ.63 లక్షలు కేటాయించేలా కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఒకరు హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో కమిషనర్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
కమిషనర్ నిర్ణయాలు ఇలా అడుగడుగునా వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. ఆయన తీరుతో కమిషనరేట్‌లో పాలన కూడా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తాయి. దేవాదాయశాఖలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
వివాదాస్పద అధికారిణిపై కనికరం
ఉత్తరాంధ్రలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి మహిళా అధికారిపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. ఆమె పనితీరు తీవ్ర వివాదాస్పదమైనా చర్యలు తీసుకోకుండా కమిషనర్ ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఓ అంశంలో ఆమెతో ఉన్నతాధికారికి వివాదం తలెత్తితే, ఆయన్ను అక్కడి నుంచి తప్పించారు. దీంతో ఆ ఉన్నతాధికారి ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయారు.
* కొన్ని ఆలయాలకు టెండర్లు ఖరారు చేస్తూ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఆయన కింది అధికారి మార్చేశారు. దానిపై సైబర్ క్రైమ్ కేసు అంటూ హడావుడి చేయటమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!