అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన

‘నా వార్డులో అభివృద్ధి పనులకు కౌన్సిల్‌లో తీర్మానం చేసి ఏడాదైంది. ఇంతవరకూ ప్రారంభం కాలేదు. నాపై వివక్ష, చులకనభావం ప్రదర్శిస్తున్నారు.

Updated : 01 Apr 2023 07:03 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ‘నా వార్డులో అభివృద్ధి పనులకు కౌన్సిల్‌లో తీర్మానం చేసి ఏడాదైంది. ఇంతవరకూ ప్రారంభం కాలేదు. నాపై వివక్ష, చులకనభావం ప్రదర్శిస్తున్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’ అని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైకాపా కౌన్సిలర్‌ సంకు సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్‌ సమావేశానికి సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్‌ చేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం ఛైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం చివర్లో మాట్లాడిన సురేష్‌ తన వార్డు పరిధిలోని సమస్యలను ఛైర్‌పర్సన్‌ దృష్టికి ఆవేశంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో వెంటతెచ్చుకున్న పెట్రోలు సీసా తీసి బలవన్మరణానికి పాల్పడతానంటూ హెచ్చరించారు. మరో కౌన్సిలర్‌ తాతాజీ ఆయనను నివారించి సీసా లాగేసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో పనులు చేస్తున్నా, తన దగ్గర మాత్రం కౌన్సిల్‌ తీర్మానం జరిగి ఏడాది దాటినా ప్రారంభించలేదని, తనకు ఏడుపొస్తోందంటూ గద్గద స్వరంతో చెప్పారు. వచ్చే సమావేశం నాటికి పనులు పూర్తిచేసేలా చూస్తామని ఛైర్‌పర్సన్‌ చెప్పారు. సురేష్‌కు పలువురు అధికార పార్టీ సభ్యులు జతకలిశారు. తమ వార్డుల్లోనూ పనులు జరగడం లేదని, ప్రజలకు ముఖం చూపలేకపోతున్నామని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని