మద్దతు ధరతోనే సాగు లాభదాయకం

రైతులు పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర కల్పించినప్పుడే వ్యవసాయం లాభదాయకం అవుతుందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

Updated : 01 Apr 2023 05:59 IST

లాంఫాం శతాబ్ది వేడుకల్లో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: రైతులు పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర కల్పించినప్పుడే వ్యవసాయం లాభదాయకం అవుతుందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం శతాబ్ది వేడుకలు శుక్రవారం జరిగాయి. లాంఫాం 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంలో అధికారులు, శాస్త్రవేత్తల కృషిని ఉమ్మారెడ్డి అభినందించారు. ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తమ శాస్త్రవేత్తలు వరి, పత్తి, అపరాల పంటల్లో పరిశోధనలు చేసి, మార్కెట్లోకి విడుదల చేసిన వంగడాలు దేశవ్యాప్తంగా సాగవుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ కౌలు రైతులపై ఆర్థిక భారం పడకుండా తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తులు వచ్చేలా వంగడాలు రూపొందించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వేడుకలకు ఆహ్వానించినా హాజరుకాలేదు. విద్యార్థుల కోలాటం ఆకట్టుకుంది. ఎడ్ల బండిపై తరలివచ్చిన రైతులతో లాంఫాం ప్రాంగణం సందడిగా మారింది. కృషీవలుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని