శాశ్వత భూహక్కు భవిష్యత్తు తరాలకూ ఉపయుక్తం

‘‘జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో ఎవరూ అవకతవకలకు పాల్పడలేని విధంగా పత్రాలు అందిస్తున్నాం. ఇది భవిష్యత్తు తరాలకూ చాలా ఉపయుక్తం. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే పూర్తిచేయాలి.

Published : 01 Apr 2023 04:42 IST

లక్ష్యాల మేరకు సర్వే పూర్తి చేయాలి
రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ‘‘జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో ఎవరూ అవకతవకలకు పాల్పడలేని విధంగా పత్రాలు అందిస్తున్నాం. ఇది భవిష్యత్తు తరాలకూ చాలా ఉపయుక్తం. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే పూర్తిచేయాలి. అవసరమైతే సాంకేతిక పరికరాలను రప్పించుకోవాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున సర్వే చేపట్టలేదని, ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్న కార్యక్రమమని వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన రెవెన్యూ అధికారులతో ఈ పథకంపై సమీక్షించారు. రెవెన్యూశాఖ పరిధిలో తొలిదశలో 2,000 గ్రామాల్లో చేపట్టిన సర్వేపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మే 20 నాటికి సర్వేరాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రక్రియలూ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వే పరికరాలు తప్పనిసరిగా ఉండాలని జగన్‌ ఆదేశించారు. సరిహద్దుల వద్ద వేసుకునేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధం చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. రోజుకు 50వేల వరకు సర్వే రాళ్లు సిద్ధమవుతున్నాయని చెప్పారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని