ఆస్తి పన్ను భారం రూ.564.51 కోట్లు?

పట్టణ స్థానిక సంస్థల్లో పెరిగిన ఆస్తి పన్ను రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి అమలులోకి రానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం పన్ను లక్ష్యంలో దాదాపు 15% పెరగనుంది.

Updated : 01 Apr 2023 11:41 IST

పట్టణాల్లో నేటి నుంచి అమలులోకి పెరిగిన పన్ను

ఈనాడు, అమరావతి: పట్టణ స్థానిక సంస్థల్లో పెరిగిన ఆస్తి పన్ను రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి అమలులోకి రానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం పన్ను లక్ష్యంలో దాదాపు 15% పెరగనుంది. రూ.3,763.44 కోట్ల ఆదాయ లక్ష్యంలో ప్రజలపై భారం దాదాపు రూ.564.51 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి పెరిగిన పన్ను తాఖీదులు ప్రజలకు ఇచ్చాకే భారం ఎంతనేది స్పష్టంగా తెలియనుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది పెంచిన ఆస్తుల విలువ ప్రకారం ప్రజల ఇళ్లు, భవనాల విలువలను మరోసారి మదించి పన్నులు వేస్తే ప్రజలపై భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే విధానం పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో 2021-22 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు పెరిగిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా... ఏడాదికి 15% చొప్పున ఆ మొత్తానికి సమానమయ్యే వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండేళ్లలో 15% చొప్పున పన్ను పెంచిన పట్టణ స్థానిక సంస్థలు కొత్త ఏడాది (2023-24)లో మరో 15% పెంచుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. మూడు, నాలుగు రోజుల్లో పెరిగిన కొత్త ఆస్తి పన్నుతో డిమాండ్‌ నోటీసులు పురపాలక శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని